పోలీసు పోషిత నేర సామ్రాట్ నయీం ఎన్కౌంటర్ తర్వాత మీడియా దృష్టికి చాలా పేర్లు వచ్చాయి. అయితే వాటిలో తెలుగుదేశం మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేరొక్కటే ప్రచారంలో పడింది. అందుకు తగినట్టే ఆమె కూడా మీడియాను పిలిచి బహిరంగంగా ఖండించారు. తను కీశే మాధవరెడ్డి వున్నప్పటి నుంచి ఇదే ఫోన్ వాడుతున్నానంటూ దాని కాల్‌లిస్టు పరివీలించాలని సవాలు చేశారు. ఈ రోజుల్లో మామూలు వాళ్లే రెండు మూడు ఫోన్లు వాడతారు గనక అది పెద్దగా నిలిచే వాదన కాదు. ఇక నేరస్తులతో సంబంధం పెట్టుకోవడం మాకేం అవసరం అని ఒకటికి రెండు సార్లు ప్రశ్నించారు గాని అందులోనూ పెద్ద బలం లేదు. మీరే ఎందుకు మీడియాను పిలిచారనే ప్రశ్నకు మాత్రం ఆమె బాగా జవాబిచ్చారు- మీరు ఉదయం నుంచి నన్నే ఎందుకు అడుగుతున్నారు అని. ఇంతకూ పదేళ్లుగా ప్రతిపక్షంలో వుంటూ మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన తనకన్నా పాలకపక్షం వారికే నయీంతో ఎక్కువ సంబంధాలు వుండే అవకాశం వుందని ఆమె చేసిన వాదనలో తర్కం వుంది. పదేపదే మంత్రి జగదీష్ రెడ్డి పరు ప్రస్తావించారు గాని ఆయనపై ఆరోపణలేమీ చేసింది లేదు. అయితే ఆమె వాదనలో మరీ బలహీనమైందేమంటే నయీం బాధితుల గురించి తనకేమీ తెలియదని చెప్పడం. భువన గిరి కేంద్రంగా పెరిగిన నయీం గురించి ఇన్ని కథనాలు సమాచారాలు వస్తుంటే వాటిపై ఆమె ఎందుకు స్పందించలేదు? ఇప్పుడైనా ఎందుకు వాటిని ఖండించేందుకు సిద్ధం కావడం లేదు? తన దృష్టికే రాలేదని అంటున్నారంటే ఏమనుకోవాలి? ఇది టిఆర్ఎస్పై నుంచి దృష్టి మళ్లించేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఒకసారి, ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావచ్చని మరోసారి ఆరోపించారు. ఆఖరుకు తమ పార్టీ వారు కూడా దీని వెనక వుండొచ్చనే వరకూ వెళ్లారు.
ఆమె అన్నట్టు సిట్‌తో పరిమితం కాకుండా న్యాయ విచారణ వంటిది జరిపి అన్ని వివరాలు బయిటకు తీస్తే మంచిదే. ఇంతకూ ప్రతిపక్ష ఎంఎల్ఎ మద్దతు వున్నంత మాత్రాన ఇంతటి దందాలు సాధ్యమా అని అడిగితే భువనగిరి వరకూ ఆ కుటుంబం పట్టు కొనసాగుతుందని చెబుతున్నారు పోలీసులు. ఏమైనా ఉమా మాధవరెడ్డి పేరుతోనే ఈ జాబితా ఆగిపోతే సరికాదు. ఉదాహరణకు టిఆర్ఎస్ ఎంపి ఒకరు దుబారులో నయీం కు ప్టాట్ తీసిపెట్టినట్టు పోలీసులు అంటున్నారు. తను ఎవరికి ఫోన్ చేసి బెదిరించారో ఆ వివరాలు వెల్లడించడం లేదు. టిఆర్ఎస్ కీలక కుటుంబం సభ్యులకో సన్నిహితులకో కూడా హెచ్చరికలు చేయడం ద్వారా నయీం ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నాడని అంతా అంటున్నారు. అసలు కొత్త రాష్ట్రం నూతన ప్రభుత్వం శక్తివంతమైన పార్టీ వుండగా రెండేళ్లు నయీం నిరాఘాటంగా ఎలా కొనసాగాడు? ఇప్పుడైనా అతని నుంచి అన్ని లోగుట్టులు రాబట్టేబదులు కాల్చిపారేయడం వల్ల సత్యం సమాధి అయిపోయినట్టే కదా..