విశాఖ రియల్ ఎస్టేట్‌కు ఊహించనంత స్కోప్ ఉంది. అద్భుతమైన, సుందరమైన సిటీ కావడమే కాదు రానున్న రోజుల్లో ఐటీ హబ్‌గా మారనుంది. పైగా ఈ ప్రాంతం క్లాస్ ఏరియాగా గుర్తింపు పొందింది. దీంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ సొంత ఇల్లు లేదా ఫ్లాట్ ఉండటాన్ని స్టేటస్‌గా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే డిమాండ్ పెరుగుతోంది.
మధురవాడ విశాఖపట్నంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలలో ఒకటి. విశాఖపట్నం-విజయనగరం రహదారిలో ఉండే మధురవాడ ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉండేది. కానీ ఇపుడు విశాఖ సిటీలో భాగంగా మారింది. ఐటీ సెజ్, విద్యా సంస్థలు, టూరిజం ప్రాజెక్టులు ఉన్నాయి. బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త దగ్గరే అనుకోవచ్చు. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం మధురవాడలో 2-బీహెచ్‌కే అపార్ట్మెంట్ ధర సుమారు రూ. 40 నుంచి 60 లక్షలు చెబుతున్నారు. 3-బీహెచ్‌కే రూ. 70 లక్షల నుంచి రూ. 1.2 కోట్ల వరకు ఉంటుంది రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు ఉంటాయి. ఐటీ సెజ్ ,బీచ్ రోడ్ సమీపంలో కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు మధురవాడలో ఎక్కువగా స్థలాలు, ఇళ్లు కొంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం జోరుగా సాగుతోంది.
బోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే, మధురవాడలో ఆస్తుల విలువ 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హైవేకు సమీపంలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నా..కాస్త లోపలికి వెళ్తే రోడ్లు, నీటి సరఫరా ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు . పైగా రియల్ ఎస్టేట్ బూత్ ఉందని కొంతమంది డెవలపర్లు అనుమతుల్లేని ప్లాట్లు అమ్ముతున్నారు. లకాస్త జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.