ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంటి పెట్టుబడులు రావడం లేదు.. పరిశ్రమల్ని ఆకర్షించడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి తిప్పి కొట్టారు. రెండేళ్లలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కన్నా ఏపీకే ఎక్కువ పెట్టబడులు వచ్చాయన్నారు. ఆ లెక్కలు కూడా విడుదల చేశారు. 2019లో 34, 696 కోట్లు పెట్టుబడులు రాగా 2020లో 9, 840 కోట్లు, 2021లో ఇప్పటివరకు 1039 కోట్లు పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఆయన ప్రకటించారు. ఈ స్థాయిలో పెట్టుబడులు … పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక కూడా సాధించలేకపోయిందని ఆయన లెక్కలతో సహా వివరించారు.
ఈ రెండేళ్లలో నలభై వేల కోట్ల పెట్టుబడులంటే ఆషామాషీ కాదు. భారీ స్థాయిలో వచ్చినట్లే. కియాపరిశ్రమను మొదటి దశలో పెట్టడానికి రూ. పది వేల కోట్లను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. అంటే.. కియా లాంటివి నాలుగు పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నమాట. అంత భారీస్థాయి పెట్టుబడులు కాకపోయినా… ఎంఎస్ఎఈ రంగంలో ఈ పెట్టుబడులు వచ్చాయనుకుంటే… కొన్ని లక్షల మందికికొత్తగా ఉపాధి లభించి ఉండేది. అయితే..ప్రభుత్వం ఈ విజయాన్ని ప్రచారం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయింది. ప్రతీ పథకానికి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చినట్లుగా… తాము వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల వివరాలు.. వాటి ద్వారా ఎవరెవరికి ఎంత మందికి ఉపాధి లభించిందో… ప్రకటిస్తే.. ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టినట్లవుందన్న అంచనాలు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ ఇంటలిజెంజ్ తో పాటు… పులివెందులలో కొన్ని పరిశ్రమలు.. అనంతపురంలో బస్ తయారీ పరిశ్రమ అంటూ.. కొన్ని ప్రకటనలు అప్పట్లో వచ్చాయి., వాటి సంగతి ఏమయిందో ఎవరికీ తెలియదు. కొత్తగాఏ పరిశ్రమకైనా శంకుస్థాపన జరిగినట్లుగా ఎక్కడా లేదు. చివరికి లాక్ డౌన్ కారణంగా.. పెద్ద ఎత్తున చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని లెక్కలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం… పరిశ్రమల మంత్రి మాత్రం చెబుతోంది వేరుగా ఉంది. ఈ విషయంలో ప్రజలకు నిజాలు తెలియచేస్తే.. ప్రభుత్వంపై మరింత విశ్వసనీయత పెరుగుతుంది.