తెదేపా నుండి తెరాసలో చేరిన అనేక మంది నేతలు, ఎమ్మెల్యేల గురించి తెదేపా పెద్దగా పట్టించుకోదు. అలాగే వారు కూడా తెదేపా గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కరే అందుకు మినహాయింపని చెప్పవచ్చును. ఆయన పార్టీని వీడి తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరి చాలా కాలం అయినప్పటికీ పార్టీకి, ఆయనకి మధ్య బంధం ఇంకా తెగిపోలేదనే చెప్పవచ్చును. తెదేపా నేతలెప్పుడూ ఆయన గురించి మాట్లాడుతుంటారు. అలాగే ఆయన కూడా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూనే ఉంటారు.
చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. తెలంగాణా మంత్రిగా ఉన్న ఆయనకి దీనితో సంబంధం లేదు కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అవకాశం వస్తే ఆయన మిగిలినవారిలా మాట్లాడకుండా నోరు కట్టేసుకోలేరు కనుక మాట్లాడారు.
ఆయన నిన్న శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇప్పటికే చాలాసార్లు విదేశీయాత్రలు చేసి వచ్చేరు. మళ్ళీ ఇప్పుడు లండన్ కూడా వెళ్ళారు. కానీ ఆయనను పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. ఈవిషయం నేను చెప్పడం లేదు. ఆంధ్రాలో నా స్నేహితులు చెప్పిన మాట ఇది. శాసనసభ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు కూడా ఆయన జవాబు చెప్పలేక తన మంత్రులను ఆయనపై ఉసిగొల్పి జవాబులు చెప్పకుండా తప్పించుకొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు మాల, మాదిగ కులస్థుల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రాలో కాపు, బీసిల మధ్య చిచ్చు పెడుతున్నారు. బడ్జెట్ లో కాపుల కోసం వెయ్యి కోట్లు కేటాయించినప్పటికీ దానిని నిజంగా విడుదల చేస్తారని నేను భావించడం లేదు,” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తలసాని మాటలలో నిజానిజాల సంగతి ఎలాగా ఉన్నప్పటికీ, ఆయన గొంతులో అచ్చం జగన్మోహన్ రెడ్డి మాటలే వినిపిస్తున్నాయి. కనుక ఆయన చెపుతున్న ఆంధ్రాలో ఆ స్నేహితుడు బహుశః జగన్మోహన్ రెడ్డేనేమోనని అనుమానించవలసి వస్తోంది. జగన్ కూడా చంద్రబాబు నాయుడుని ఇదే విధంగా విమర్శిస్తున్నప్పటికీ అది మరీ రొటీన్ విమర్శలుగానే కొట్టుకొని పోతుంటాయి. అదే పొరుగు రాష్ట్రంలోని మంత్రి ఒకప్పటి తెదేపా సీనియర్ నేత అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారి నోటి నుండి అవే మాటలు వస్తే అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. దానికి వెయిట్ పెరుగుతుంది కూడా. బహుశః అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘నిన్ను వదల బొమ్మాళి’ అంటూ చంద్రబాబు నాయుడి వెంటపడుతున్నారేమో?