ఇల్లంటే నాలుగు రెండు గదులు, కిచెన్, హాలు అని అనుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇంటీరియర్‌తో మెరిసిపోవాలి. ఇప్పుడు అది కూడా పాతదైపోయింది. ఇప్పుడు స్మార్ట్ సౌకర్యాలు కూడా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చేశారు. అందు కోసం లక్షలు ఖర్చుపె్టటేందుకు వెనుకాడటం లేదు. విదేశాల్లో అధ్యయనం చేసి మరీ స్మార్ట్ హోమ్స్‌గా ఇళ్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి అభిరుచులకు తగ్గట్లుగా నిర్మాణ సంస్థలు, స్మార్ట్ హోమ్స్ సర్వీస్ సంస్థలు వ్యాపారాన్ని మార్చుకుంటున్నాయి.
ఇంటి భద్రతపైనే ఎక్కువ మంది ఆందోళన ఉంటుంది. స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటే భరోసాగా ఉండొచ్చునన్న అభిప్రాయంఉంది. స్మార్ట్ హోమ్ సిస్టమ్ లో బాగంగా వైఫై సెక్యూరిటీ కెమెరా రాత్రిపూట కూడా పనిచేస్తుంది. వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్విచ్చులు వచ్చాయి. టీవీలు ఏసీలు మాత్రమే కాదు ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్ తో నియంత్రించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. మొబైల్ లోని యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్, ఆఫ్ చేయవచ్చు.
స్మార్ట్‌గా పనిచేసే ఎల్ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినపడితే అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. తీరిక లేకుండా ఉండేవారికి ఇంటిని శుభ్రం చేసే స్మార్ట్ క్లీనింగ్ రోబోలు వచ్చాయి. చిన్న పరిమాణంలో వచ్చిన ఈ క్లీనింగ్ రోబో సులువుగా శుభ్రం చేస్తుంది. మూలలు, ఫర్నిచర్ అడుగుభాగం అన్నిచోట్లకు వెళుతుంది. క్లీనింగ్ రోబోలతో ఏ రోజు, ఏ సమయంలో శుభ్రం చేయాలో ఆదేశాలు ఇస్తే చాలు దానంతట అది పనిచేసుకుంటూ పోతుంది. గదిలో వెళ్లగానే లైట్ వెలిగి.. బయటకు రాగానే ఆరిపోయేలా సెన్సర్లతో పనిచేసేలా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇల్లు స్మార్ట్ అవుతుంది.
గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాను, ఏసీలు పనిచేయడం వరకు చాలా ఉన్నాయి. వేసవిలో బయటి నుంచి ఇంటికి రాగానే చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇంటికి చేరువలో ఉన్నప్పుడే మొబైల్ ఆధారంగా ఏసీని ఆన్ చేస్తే ఇంట్లో అడుగుపెట్టేసరికి చల్లదనం స్వాగతం పలుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి వాటితో స్మార్ట్ గా తమ ఇంటిని మార్చుకునేందుకు కాస్త డబ్బున్నవారు వెనుకాడటం లేదు.