సీఎం కాకపోయినా కేటీఆర్కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. బెస్ట్ సీఎంలుగా పలు చానళ్లు చెబుతున్న వారిని కనీసం పట్టించుకోవడం లేదు. కీలకమైన మేధోమథన సదస్సులకు కేటీఆర్కు ఆహ్వానం పంపుతున్నారు. గతంలో పలు అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యారు. తాజాగా అక్టోబర్ 4వ తేదీన స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్ లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి రావాలంటూ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం కేటీఆర్కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది.
ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆసియా లీడర్స్ సిరీస్ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందన్నారు.
ఇలాంటి సమావేశాలకు హాజరవడం వల్ల తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికపై గొప్పగా ప్రజెంట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. చాలా మంది సీఎంలకు దొరకని అవకాశం కేటీఆర్కు లభిస్తోంది. ఆయనకు ఉన్న మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల తెలంగాణకు ఎంతో మేలు జరుగుతోంది.