కాశ్మీరులో పాకిస్తాన్, ఐసిస్ జెండాల రెపరెపలు, వేర్పాటువాదుల భారత వ్యతిరేక సభలు, ఊరేగింపులు నిత్యకృత్యం అయిపోయాయి. సరిహద్దులలో కాల్పులు, ఉగ్రవాదుల దాడులు కూడా తరచూ కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోం మంత్రి నివాసాలపైన గగనతలం నుండి దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్లు ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం చాప క్రింద నీరులా చాలా రాష్ట్రాలకు వ్యాపించినట్లు ఇపుడిపుడే నిఘావర్గాలు గుర్తిస్తున్నాయి.
రాజస్థాన్ లోని జయపూర్ లో ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న మహ్మద్ సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నందుకు ఏంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు నేడు అరెస్ట్ చేసారు. అతను ఉగ్రవాదులతో నేరుగా సంభాషిస్తూ వారి ఆదేశాల మేరకు ఐసిస్ భావజాలాన్ని ఇంటర్నెట్ ద్వారా దేశవిదేశాలకు వ్యాపింపజేస్తూ, ఐసిస్ కోసం రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నట్లు కనుగొన్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ త్రిపాఠి మీడియాకు తెలియజేసారు.
ఒక మంచి సంస్థలో మంచి పదవిలో ఉన్న వ్యక్తి కూడా మత ఛాందసవాదంతో ఐసిస్ వంటి కిరాతకులయిన ఉగ్రవాదులతో చేతులు కలపడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఉన్నత విద్యావంతులే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఇక సమస్యలతో బాధపడుతున్నవారు ఐసిస్ విసురుతున్న ఈ వలలో చిక్కకుండా ఉంటారా? అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు భారత్ కి ఇంతకు ముందు కంటే ప్రమాద స్థాయి పెరిగిందని ఈ అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కనుక చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కూడా అగ్రరాజ్యాలతో సమానంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమయిన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసి ఉంది.