వైసీపీ నిర్వహణ పూర్తిగా ఐ ప్యాక్ అధీనంలోకి వెళ్లిపోయింది. పీకే టీం ఇచ్చే రిపోర్టులు… నివేదికల ఆధారంగానే అన్నీ జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి బీసీల సదస్సు పెడితే.. ఐ ప్యాక్ టీం సహకారంతో పెట్టానని చెప్పుకున్నారు. జగన్ టెక్కలి సమీక్ష నిర్వహిస్తే.. ఆ సమావేశానికి ఎవరెవరు రావాలన్నది ఐ ప్యాక్ టీం డిసైడ్ చేసింది. అలా వచ్చిన వాళ్లు మెజార్టీ వ్యతిేకించినా దువ్వాడను జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీనికి కారణం అచ్చెన్నకు ధీటుగా నిలబడేది దువ్వాడేనని అదే ఐ ప్యాక్ నివేదిక ఇవ్వడమే.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా పని చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయం చేసుకుంటూ బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు కానీ.. ఏపీలో ఐ ప్యాక్ టీం మాత్రం పని చేస్తోంది. పీకేకు సన్నిహితుడైన రిషి రాజ్ నేతృత్వంలో ఏపీలో పీకే టీం పని చేస్తోంది. ఇటీవల తెలంగాణలో పీకే టీం పని ఆపేసింది. ఆ సిబ్బంది అంతా ఏపీకి వచ్చారు. దీంతో నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు. వారిపైనే జగన్ ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఐ ప్యాక్ టీం అంటే… మంత్రులకూ వణుకు తప్పడం లేదు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పూర్తిగా ఐ ప్యాక్ టీం ఎగ్జిక్యూషన్ చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు ఎలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనేది ప్రతీ రోజూ నివేదికలు పంపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు గడప గడపకూ వెళ్లడంతో లేదో.. నేరుగా జగన్‌కే చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పీకే టీం నివేదికలపై ఆధారపడి ఉంటుందని జగన్ పదే పదే చెబుతున్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు.
పీకే టీం ఓవరాక్షన్ కారణంగా .. తెలంగాణలో ఒప్పందం చేసుకుని మరీ కేసీఆర్.. వెంటనే పంపేశారు. తెలంగాణలో ఉండొద్దని చెప్పేశారు. కానీ జగన్ మాత్రం పూర్తి స్థాయిలో నమ్మి .. మొత్తం ఐ ప్యాక్ పైనే భారం వేసేశారు.