ఎప్పుడూ లేనిది ఐపీఎల్ లో చెన్నై ముందే చేతులెత్తేసింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ చెన్నై తన పూర్తి స్థాయి ఆటతీరుని కనబరచలేదు. మూడు మ్యాచ్‌లలో గెలిచినా సరే, ఆ గెలిచిన మ్యాచ్‌లలోనూ కొన్ని తప్పులు చేసింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచి, ప్లే ఆఫ్‌కి దూరమైంది. ఐపీఎల్ చరిత్రలో.. ప్రతీ సీజన్లోనూ ప్లే ఆఫ్‌కి వెళ్లిన చెన్నై – తొలిసారి అందుకు అర్హత కోల్పోవడం చెన్నై అభిమానుల్ని తీవ్రమైన నిరాశకు గురి చేస్తోంది. చెన్నై ఓడిపోవడం కంటే, ధోనీ అనుసరించిన వ్యూహాలు, గేమ్ ప్లాన్, ఆటగాళ్లని ఎంచుకునే పద్ధతీ.. ఇవన్నీ అభిమానుల్ని కలవరపెట్టించాయి. ఈ సీజన్లో చెన్నై అట్టర్ ఫ్లాప్ షో వెనుక కారణాల్ని పరిశీలిస్తే…
1. సురేష్ రైనా టోర్నీ ఆరంభానికి ముందే… జట్టుకు దూరమవ్వడం తొలి దెబ్బ. కారణాలు ఏమైనా కావొచ్చు సురేష్ రైనా వెళ్లిపోయినప్పుడు జట్టు తగిన ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోలేకపోయింది. కనీసం ధోనీ అయినా స్పందించి – రైనాని వెనక్కి పిలవాల్సింది. అది జగరలేదు. రైనా లేని లోటు స్పష్టంగా కనిపించింది. రైనా లేకపోయినా గెలవగలం అనే అతిథీమా చెన్నై కొంప ముంచింది. హర్బజన్ కూడా సిరీస్‌కి ముందే దూరం అయ్యాడు. అసలు దాన్ని జట్టు సమస్యగానే తీసుకోలేదు. చివరికి భజ్జీ లాంటి సీనియర్ ప్లేయర్ జట్టులో లేని లోటు.. ఇప్పుడు తెలిసొస్తుంది.
2. చెన్నై జట్టులో ఉన్నవాళ్లంతా సీనియర్లే. వయసు రీత్యా.. అంతా 30 నుంచి 35లో ఉన్నవాళ్లు. ఓరకంగా చెప్పాలంటే ఇది ముసలోళ్ల టీమ్. కుర్రాళ్లు లేకోవడం చెన్నైకి పెద్ద దెబ్బ.
3. ధోనీకి పెట్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్లు విపలం అవుతున్నా, పదే పదే వాళ్లకు అవకాశం ఇచ్చి ఆ ఆటగాళ్లపై తన ప్రేమని చాటుకున్నాడు ధోనీ. అది జట్టుకి తీవ్రమైన సమస్యగా మారింది. ముఖ్యంగా కేదార్ జాదవ్ వరుసగా విఫలం అవుతున్నా.. ధోనీ తనపైనే నమ్మకం ఉంచాడు. కేదార్ ఎంత పేలవమైన ఫామ్ లో ఉన్నాడంటే.. కనీసం బంతిని బ్యాట్ తో టచ్ చేయలేకపోతున్నాడు. కొలకొత్తాపై గెలవాల్సిన మ్యాచ్‌లో కేదార్ జిడ్డు బ్యాటింగ్ చూసి, చెన్నై అభిమానులకే విసుగొచ్చింది. దాంతో తదుపరి మ్యాచ్ కి దూరం పెట్టారు. కానీ ఆ తరవాత మళ్లీ మామూలే. ఒక మ్యాచ్‌కి దూరమైన కేదార్… వెంటనే జట్టులో ప్రత్యక్షమైపోయాడు.
4. బౌలింగ్ మార్పుల్లో ధోనీ ఎప్పుడూ తెలివితేటలు చూపిస్తుంటాడు. ఓడిపోవాల్సిన మ్యచ్‌లను సైతం.. ధోనీ తన ప్లానింగ్ తో గెలిపించేవాడు. కానీ ఈసారి అది జరగలేదు. తన బౌలర్లని సరైన టైమ్‌లో వినియోగించుకోలేకపోయాడు. దిల్లీ తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సివచ్చినప్పుడు ధోని జడేజాకు బౌలింగ్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఆ సమయానికి బ్రావో అందుబాటులో లేడని ధోనీ కారణాలు చెప్పినా – అది రాంగ్ ప్లానింగే. అతి ముఖ్యంగా.. ధోనీ ఫామ్ లో లేడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ కి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా ఉన్న ఆటగాడు ధోనీ. అలాంటిది… బ్యాట్ పట్టుకోవడమే రానట్టు ఆడాడు. హిట్టింగ్ చేయాల్సిన చోట కూడా జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు.
5. డూప్లెసీస్ – వాట్సన్లది అద్భుతమైన ఓపెనింగ్ జోడీ. ఈ సిరీస్ లో ఓ మ్యాచ్‌లో అసలు వికెట్ పడకుండా.. లక్ష్యాన్ని ఛేదించి ఆశ్చర్యపరిచారు. అలాంటి జోడీని ధోనీ విడగొట్టాడు. గత మూడు మ్యాచ్‌లుగా కరన్ ని ఓపెనింగ్ కి పంపాడు. దాంతో లయ తప్పింది. డూప్లెసిస్, వాట్సన్ లు కూడా మునుపటి పదును చూపించలేకపోయారు.
6. ఇమ్రాన్ తాహీర్ లాంటి ఆటగాడు జట్టులో ఉన్న తన సేవల్ని ఉపయోగించుకోలేదు. గత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ తను. అలాంటి బౌలర్ ని ఉంచుకుని… వాడుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.