ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించి… విజేతగా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేయగలిగింది. బదులుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే.. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొంది. గిల్ 45 పరుగులతోనూ, మిల్లర్ 32 పరుగులతోనూ నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో బట్లర్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జస్వాల్ 22 పరుగులతో ఓకే అనిపించాడు. మిగిలిన వాళ్లెవరూ సరిగా రాణించకపోవడంతో… భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో హార్థిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసుకొన్నాడు. కీలకమైన సమయంలో బ్యాటింగ్ కి దిగి.. 34 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అనుకొన్నట్టే జరిగింది..!
ఈ మ్యాజ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ మైదానంలో జరిగింది. ఫైనల్‌కు నరేంద్రమోడి హాజరయ్యారు. దాంతో.. గుజరాత్ ఈ మ్యాచ్ గెలుస్తుందని నెటిజన్లు ముందే ఊహించారు. `వచ్చిన గెస్ట్… ఆడుతున్న మైదానాన్ని బట్టి చూస్తే ఐపీఎల్ విజేత ఎవరో తెలిసిపోతుంది` అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు. అనుకొన్నట్టే గుజరాత్ గెలిచింది. దాంతో…చాలామంది `ఈ ఫైనల్ ఫిక్స్ అయ్యింది` అంటూ అప్పుడే కామెంట్లు చేయడం మొదలెట్టారు. ఏదేమైనా ఈ టోర్నీలో ముందు నుంచీ నిలకడగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్.. కప్పు చేజిక్కించుకొంది. నిజంగానే.. విజేతగా ఆవిర్భవించడానికి గుజరాత్ కి అన్ని అర్హతలూ ఉన్నాయి.