ఐపీఎల్.. కుర్రాళ్లని కట్టిపడేసే ఈవెంట్. దాదాపు 2 నెలలు ఐపీఎల్ కి అంకితమైపోతుంది యువతరం. వేల కోట్ల వ్యాపారం ఈ ఆట చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. వేసవిలో ఐపీఎల్ ని మించిన వినోదం లేదు. కాకపోతే.. సంప్రదాయ వాదులకు, క్రికెట్ ని క్రికెట్ గానే చూసేవాళ్లకు ఐపీఎల్ నచ్చదు. ఇదో జిమ్మిక్ అంటుంటారు. ఫిక్సింగ్ కు ఇంత కంటే మంచి వేదిక లేదని నిందిస్తుంటారు. అప్పుడప్పుడూ ఐపీఎల్ లో జరుగుతున్న తమాషాలు చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంటుంది.
హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఇదీ వన్ సైడ్ వారే. ముంబై అలవోకగా గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఈషాన్ కిషన్ అవుటైన తీరు మాత్రం చర్చనీయాంశమైంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీపక్ చాహర్ వేసిన బాల్ లెగ్ స్టంప్‌కి దూరంగా వెళ్లింది. కీపర్ క్యాచ్ అందుకొన్నాడు. కామెంటేటర్లు ‘ఇది వైడ్’ అన్నారు. ఎంపైర్ కూడా వైడ్ సూచించడానికి చేతులు అడ్డంగా ఎత్తే ప్రయత్నంలో ఉంటే.. అనూహ్యంగా ఇషాన్ ఇషాన్ తాను ఔటైనట్టు భావించి పెవిలియన్ వైపు నడుచుకొంటూ వెళ్లాడు. దాంతో ఎంపైర్ వైడ్ నిర్ణయాన్ని ఔట్ గా మార్చుకోవాల్సివచ్చింది. ఇదంతా క్షణ కాలంలో జరిగిపోయాయి. ఇషాన్ ఔట్ అంటూ ఒక్కరు కూడా అప్పీల్ చేయలేదు. కిషన్ తనకు తానే.. ఔట్ అనుకొన్నాడు. ఇదంతా క్రీడా స్ఫూర్తిలే అనుకొనేలోగా, అసలు బంతి బ్యాట్‌కు తాకలేదని రీప్లేలో స్పష్టమైంది. అసలు లైవ్ లో చూసినా, అది నాటౌట్ అనే సంగతి తెలిసిపోతుంది. దానికి రీప్లే ని అవసరం లేదు. అయినా సరే.. ఇషాన్ వెళ్లిపోవడం క్రీడాభిమానులు తప్పుపడుతున్నారు. ఇదేం క్రీడా స్ఫూర్తి అని నిలదీస్తున్నారు. కిషన్ హైదరాబాద్ టీమ్ లో ఉంటూనే, ముంబై తరపున ఆడాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే.. ఐపీఎల్ స్ఫూర్తిపై అనుమానాలు వస్తుంటాయి. ముంబైకి ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యవసరం. గెలిస్తే టాప్ 4లో నిలుస్తుంది. అందుకే తిమ్మిని బమ్మి చేసి.. ఈ మ్యాచ్‌ని గెలిచారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం ముంబై జట్టు ఆటగాళ్లతో ఇషాన్ నవ్వుతూ మాట్లాడడం హైదరాబాదీ అభిమానులకు మరింత మంట పుట్టిస్తోంది. ఇషాన్ ఇది వరకు ముంబై తరపునే ఆడాడు. ఈసారి హైదరాబాద్ కు వచ్చాడు. ఆ జట్టుపై ఇషాన్‌కు ప్రేమ చావలేదని, అందుకే.. తన వికెట్ త్యాగం చేసి అది నిరూపించుకొన్నాడని విమర్శకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. దీనికి ఇషాన్ ఎలా స్పందిస్తాడో మరి.