ఒకప్పుడు సమ్మర్ అంటే సినిమాలదే హవా. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. దాదాపు రెండు నెలలకు పైగా జరిగే ఈ మెగా టోర్నీ హంగామా మామూలుగా వుండదు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 వరకూ క్రికెట్ అప్డేట్స్ తోనే బిజీ అయిపోతుంది యువత. టీవీలకి, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతారు. కొన్ని గేటెడ్ కమ్యునిటీస్ లో అయితే బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి సమూహాలుగా ఆస్వాదిస్తుంటారు.
అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా సమ్మర్ సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తుంటాయి. ఈ సమ్మర్లో కూడా టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడి బాగానే వుంది. నితిన్ రాబిన్ వుడ్, మ్యాడ్ 2, సిద్దు జాక్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రియదర్శి సారంగపాణి జాతకం, విష్ణు కన్నప్ప, నాని హిట్ 3, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రవితేజ మాస్ జాతర .. ఇవన్నీ కూడా సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే సినిమాలే.
క్రికెట్ దారి క్రికెట్ దే, సినిమాల దారి సినిమాలదే అనే అభిప్రాయం కూడా వుంది. క్రికెట్ సినిమాలపై ఎఫెక్ట్ చూపించదని కొందరు వాదిస్తుంటారు. సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి క్రికెట్ అడ్డంకి కాదని చెబుతుంటారు. అయితే ఇక్కడ కూడా ఓ కండీషన్ వుంది. ముందు సినిమాకి హిట్ టాక్ రావాలి. యునానిమాస్ గా సినిమా బావుందనే టాక్ వస్తే సినిమాని ఇష్టపడే ఆడియన్స్ ఏదో ఒక షో ప్లాన్ చేసుకుని చూస్తారు. బిలో యావరేజ్, ఓటీటీలో చూసుకోవచ్చులే అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే మాత్రం అలాంటి సినిమాపై ఖచ్చితంగా ఐపీఎల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ షోలపై ఐపీఎల్ ఎఫెక్ట్ బలంగా వుంటుంది.
ఐపీఎల్ భయం నిర్మాతలకూ వుంది. చాలా కాలంగా సినిమాల్ని ఐపీఎల్ డామినేట్ చేస్తోంది. కాకపోతే.. సినిమా బాగుంటే, జనం వస్తారులే అనే కాస్త నమ్మకం నిర్మాతలకు వుంది. సమ్మర్ లో ఓ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే, ఫలితం ఎలా వుంటుందో కూడా వాళ్లకు తెలుసు. అందుకే ధైర్యం చేస్తుంటారు.
ఈసారి ఛాంపియన్ ట్రోఫీ కొట్టి టీంమిండియా ఆటగాళ్ళు ఫుల్ జోష్ లో వున్నారు. క్రికెట్ లవర్స్ కూడా ఆటపై మాంచి పాజిటివ్ వైబ్ తో వున్నారు. గత సీజన్స్ కంటే ఈ సీజన్ కి మరింత ఆదరణ దొరికే ఛాన్స్ కూడా వుంది. మరి ఇలాంటి నేపధ్యంలో సమ్మర్ సినిమాలపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఏ మేరకు వుంటుందో చూడాలి.