సొంత మైదానంలోనూ ముంబై ఇండియన్స్ కథ మారలేదు. మరో పరాజయంతో అభిమానుల్ని నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాల్ని మరి కాస్త క్లిష్టతరం చేసుకొంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమి మూటగట్టుకొంది. అయితే… ఈసారి కాస్తో కూస్తో ఉపశమనం ఏమిటంటే.. మ్యాచ్ ఏకపక్షం కాలేదు. దారుణంగా ఓడిపోతుందేమో అనుకొన్న దశలో ముంబై పుంజుకొంది. ఓ దశలో అసాధ్యమైన ఛేదనని హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సుసాధ్యం చేస్తారేమో అనిపించింది. అయితే చివర్లో చక చక వికెట్లు పడడంతో.. 12 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకొంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగళూరులో కోహ్లీ (42 బంతుల్లో 67), రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64), జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్) చెలరేగి ఆడారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై 12 ఓవర్లలో 4 కీలకమైన వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. విజయానికి చాలా దూరంలో ఉన్న దశలో హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (29 బంతుల్లో 56) కూడా ఆకట్టుకొన్నాడు. ప్రతీ ఓవర్లో కనీసం 18 నుంచి 20 పరుగులు సాధిస్తూ… రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గించుకొంటూ వచ్చారు. చివరి 3 ఓవర్లలో 41 పరుగులు కావాలి. క్రీజ్లో పాండ్యా, తిలక్ ఉన్నారు. దాంతో ముంబై ఈ మ్యాచ్ గెలుస్తుందని ఆశించారు. కానీ తిలక్, పాండ్యా వెంట వెంటనే పెవీలియన్ చేరడంతో 12 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వక తప్పలేదు. ఈ సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోని రోహిత్ శర్మ (17) మరోసారి నిరాశ పరిచాడు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో పడిపోయింది ముంబై. ఇక ఇక్కడ్నుంచి ముందుకు రావాలంటే అద్భుతాలే చేయాలి.