క్రికెట్ ను పచ్చి వ్యాపారంగా మార్చిన బీసీసీఐ పెద్దలు, ఐపీఎల్ పేరుతో స్థాయిని మరింత దిగజార్చేశారు. ఏరికోరి ఎండాకాలంలోనే ఐపీఎల్ పేరుతో మరిన్ని డబ్బులు కొల్లగొట్టడానికి ప్లాన్ చేశారు. ప్రతి ఏడాదీ అదే తంతు. ప్రజలు నీటికోసం తిప్పలు పడుతుంటే పిచ్ ల నిర్వహణ కోసం లక్షల లీటర్ల నీటిని దుర్వినియోగం చేయడం ఏమిటంటూ ఓ బాధ్యత గల పౌరుడు వేసిన ప్రజా ప్రయోజనవ్యాజ్యం కలకలం రేపింది. మహారాష్ట్రలో మ్యాచ్ ల నిర్వహణ వద్దన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరిగే మ్యాచ్ లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఆదేశించింది.
ఇది తమకు ఎంతో నష్టం కలిగిస్తుందని క్రికెట్ పెద్దలు లబో దిబో మన్నారు. అయినా కోర్టు తీర్పు మేరకు ప్రత్యామ్నాయ వేదికలు చూసుకుంటూనే సుప్రీం కోర్టు ద్వారా ఊరట పొందటానికి ప్లాన్ వేశారు. క్రికెట్ అసోసియేసన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. క్రికెట్ కంటే ప్రజలే ముఖ్యమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ సబబేనని తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో మ్యాచ్ ల పేరుతో నీటి దుబారాను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.
లాతూర్ జిల్లాలో నీరు లేక జనం విలవిల్లాడుతున్నారు. రైళ్లలో నీటిని తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ బాసులకు మాత్రం కాసులే ముఖ్యమైపోయాయి. మ్యాచ్ లను తరలిస్తే కోట్లలో నష్టం వస్తుందని బీసీసీఐ పెద్దలు లెక్కలు వేశారు. సుద్దులు వల్లించారు. ప్రజల కష్టాలపట్ల సానుభూతి ఉందంటూనే సుప్రీం కోర్టులో సానుకూల తీర్పు పొందడానికి ప్రయత్నించారు. హైకోర్టు తీర్పు ఇవ్వగానే ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేసుకోవాల్సింది.
క్రికెట్ కంటే ప్రజలు ముఖ్యమనే హైకోర్టు మాటను సుప్రీం కోర్టు ఖండిస్తుందని ఎలా అనుకున్నారు? ఏ కోర్టయినా ఒకటే. ప్రజలు దాహార్తితో అలమటిస్తుంటే ఆ విషయాన్ని కోర్టులు కచ్చితంగా పరిగణనలోకి తీసుకునే తీర్పు చెప్తాయి. ఆపాటి అవగాహన కూడా బీసీసీఐ పెద్దలకు లేకపోవడానికి కారణం, డబ్బు యావతో కళ్లకు పొరలు కమ్మడమే. క్రికెట్ పెద్దలు ఇకనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మసలుకుంటారేమో చూద్దాం.