`ఈసాలా కప్ నమదే` అంటూ.. ప్రతీసారీ అభిమానుల్ని ఊరించడం, చివరికి ఉసూరు మనిపించడం… బెంగళూరుకి షరా మామూలే అయిపోయింది. 13 సీజన్లుగా కప్పు సాధించలేక… ఈసారీ, ఒట్టి చేతులతోనే ఇంటి దారి పట్టింది. కోహ్లీ, డివిలియర్స్, ఫించ్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నా – ప్లే ఆఫ్ లోనే తన ప్రయాణాన్ని ఆపేసింది. బెంగళూరు పరాభవం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అంతే కాదు.. కెప్టెన్ గా కోహ్లీ సమర్థతనీ ప్రశ్నిస్తోంది.
ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన, నమ్మదగిన, నాణ్యమైన ఆటగాడు కోహ్లీ. అతనికి అందని రికార్డు లేదు.కానీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కల.. కలగానే మిగిలిపోతోంది. గత ఎనిమిది సీజన్లుగా తనే ఆ జట్టు కెప్టెన్. కానీ ఒక్కసారిగా కప్పుని అందించలేకపోయాడు. స్టార్ ఆటగాళ్లున్నా – తన జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దాంతో కోహ్లీ సమర్థతపై, సారథ్యంపై అనుమానాలు వ్యక్తం అవడం మొదలయ్యాయి. “ఎనిమిదేళ్లుగా తన జట్టుకు కప్పు అందించని ఆటగాడు నాయకుడిగా కొనసాగడం అవసరమా“ అంటూ… గంభీర్ లాంటి మాజీలు కోహ్లీపై విరుచుకుపడుతున్నారు. స్టార్లు ఉన్నా, సమర్థత కలిగిన ఆటగాళ్లని తయారు చేసుకోవడంలో ఆ జట్టు విఫలం అవుతోందని, ప్రతీసారీ కోహ్లీ పైనో, డివిలియర్స్ పైనో ఆధారపడడం భావ్యం కాదని, మిడిల్ ఆర్డర్ లో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌ని తయారు చేసుకోకపోవడం, నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు జట్టుకు అందుబాటులో లేకపోవడం బెంగళూరు పరాజయాలకు కారణమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.
ఈ ఓటమి ఐపీఎల్‌కే పరిమితం అవుతుందని అనుకోలేం. టెస్టు, వన్డే, టీ 20లకు విరాట్ కెప్టెన్. మూడు జట్టకూ ఒకే కెప్టెన్ అనే పద్ధతి సరికాదని, ఒక్కో ఫార్మెట్ కీ ఒక్కో కెప్టెన్ నియమిచాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. రోహిత్ శర్మ తన జట్టుని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఏకంగా నాలుగుసార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. ఈసారి కూడా.. ముంబై ఫైనల్‌కి చేరింది. దాంతో త్వరలో భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు (కనీసం పరిమిత ఓవర్ల వరకూ) మారే అవకాశాలు లేకపోలేదని అనిపిస్తోంది. వచ్చే యేడాది ఐపీఎల్ కెప్టెన్సీలోనూ మార్పులు రావొచ్చేమో అనిపిస్తోంది. బెంగళూరు పగ్గాలు కోహ్లీ మరొకరికి అప్పగించి, తాను కేవలం ఆటగాడిగానే కొనసాగుతాడేమో చూడాలి. 2021లోనూ కోహ్లీ బెంగళూరుకి కెప్టెన్‌గా ఉండి, కప్పు అందించలేకపోతే.. అది మరింత పెద్ద పరాభవం అవుతుంది. ఈలోగానే కోహ్లీ ఓ మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది.