కరోనాను క్లీన్ బౌల్డ్ చేయడానికి ఐపీఎల్‌ను పరుగులు పెట్టించడానికి బీసీసీఐ, కేంద్రం కొత్త మందును కనుక్కుంది. అదేమిటంటే.. ఐపీఎల్ మ్యాచ్‌లను.. ఎంప్టీ స్టేడియాల్లో నిర్వహించడం. అంటే.. స్టేడియంలో ప్లేయర్లు, ఎంపైర్లు, ఆటకు సంబంధించిన వారు తప్ప ఇంకెవరూ ఉండకుండా మ్యాచ్‌లు నిర్వహించడం. ఈ ఆలోచనను అమలు చేసి.. వేల కోట్ల విలువైన ఐపీఎల్ ను ఎలాగైనా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. జన సమూహం ఎక్కడా ఒక చోట గుమి కూడే ప్రదర్శనలు వద్దని అనుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని నిలిపివేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యం.
కానీ ఐపీఎల్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరుతామని.. బీసీసీఐ చీఫ్ గంగూలీ గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోమ్ స్టేట్ కర్ణాటక.. కరోనా వైరస్ ఫీవర్ తో వణికిపోతోంది. తమ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు వద్దని కేంద్రానికి లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ల అమ్మకాలను ఆపేసింది. మరో వైపు కొంత మంది మద్రాస్ హైకోర్టులో ఐపీఎల్ నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారా అంటే… వారికి కరోనా ఉందేమోనని భయపడుతున్నారు.
ప్రతీ జట్టులోనూ విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఎవరూ రావడం లేదు. ఇంకా పరిస్థితి దిగజారితే వారెవరూ వచ్చే అవకాశం లేదు. అదే జరిగితే.. ఐపీఎల్ నిర్వహించడం కష్టమవుతుంది. ఒక వేళ నిర్వహించాలనుకుంటే… స్థానిక ప్లేయర్లతోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే.. ఐపీఎల్ ముందు ఉన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు.