క్రికెట్ ప్రేమికులకు ఈ ఆదివారం మహ బాగా గుర్తుండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే.. అత్యంత అరుదైన మ్యాచ్‌లు ఈ ఆదివారమే జరిగాయి. సాధారణంగా ఓ టీ 20 మ్యాచ్ `టై` అవ్వడం అరుదు. అలాంటిది ఒకే రోజు రెండు టీ 20 మ్యాచ్‌లూ టై అయిపోయాయి. ఆఖరికి…. టై కోసం ఆడిన సూపర్ ఓవర్ కూడా `టై` అయిపోవడం ఐపీఎల్ చరిత్రలోనే హైలెట్.
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలుత హైదరాబాద్ – కొలకొత్తా తలపడిన మ్యాచ్ టై అయ్యింది. నిర్ణిత 20 ఓవర్లలో కొలకొత్తా 163 పరుగులు చేస్తే, అందుకు బదులుగా దిగిన హైదరాబాద్ 20 ఓవర్ణలో సరిగ్గా 163 పరుగులే చేసింది. దాంతో.. మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్ కేవలం రెండు పరుగులే చేయగలిగింది. సూపర్ ఓవర్లో కొలకొత్త అత్యంత సులభంగా విజయాన్ని అందుకుంది.
ఇక రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ అయితే ఐపీఎల్ చరిత్రలోనే హైలెట్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్ కూడా సరిగ్గా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 5 పరుగులే సాధించింది. దాంతో.. ముంబై సూపర్ ఓవర్ లో ఈజీగా గెలుస్తుందనుకున్నారంతా. కానీ. అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. ముంబై కూడా 5 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది.
సూపర్ ఓవర్ కూడా టై అయితే… మరో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతని నిర్ణయించాలన్న నిబంధన ఉంది. దాంతో.. మరో సూపర్ ఓవర్ అవసరమైంది. ఈసారి బ్యాటింగ్ దిగిన ముంబై సూపర్ ఓవర్ లో 11 పరుగుల చేసింది. 12 పరుగుల విజయ లక్ష్యాన్ని… పంజాబ్ రెండు బంతులు ఉండగానే ఛేదించింది. దాంతో ఈ డబుల్ సూపర్ ఓవర్మ్యాచ్లో పంజాబ్ గెలిచినట్టైంది. ఓ సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ ఓవర్ వేయించడం లీగ్ చరిత్రలోనే ఇది తొలిసారి. మొత్తానికి ఈ ఆదివారం ఏకంగా మూడు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు చూసే అవకాశం క్రికెట్ ప్రేమికులకు కలిగింది. సూపరో.. సూపరహః…