నేరస్తుల్ని జైల్లో ఎందుకు పెడతారు ?. అత్యంత క్రూర మనస్థత్వం ఉన్న వారు ప్రజల మధ్యలో ఉంటే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారని ఎక్కువ మందికి హాని చేస్తారని అదే జైల్లో ఉంటే మారు మనసు పొందుతారని జైల్లో పెడతారు. కానీ అదే క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వారి చేతిలోకే వ్యవస్థలన్నీ వస్తే ఎలా ఉంటుంది ?. ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పాలనలాగే ఉంటుంది.
జగన్ పాలనలో పోలీసులే మాఫియా !
చంద్రబాబును జైల్లో ఇరికించడానికి సిమెన్స్ ఇండియా చీఫ్ ను పట్టుకొచ్చి ఆయనను నగ్నశవం పక్కన కూర్చోబెట్టి చెప్పినట్లుగా స్టేట్ మెంట్ ఇస్తావా లేదా అని బెదిరించారు. ఈ ఘటన గురించి తెలిస్తే ఇంతటి క్రూరత్వం సినిమాల్లోనే చూస్తామా అనుకుంటాం. ఇలాంటివి కొన్ని వందలు.. బయటకు రానివి కొన్ని వేలు జరిగాయని హీరోయిన జెత్వానీ విషయంలో నిరూపితమయింది. ఆమెపై విజయవాడ పోలీసులు చూపిన క్రూరత్వానికి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోతోంది. కోల్ కతా డాక్టర్ పై హత్యాచారం చేశారు.. జెత్వానీపై మానసికంగా అదే స్థాయిలో అఘాయిత్యం చేశారని అర్థం చేసుకోవచ్చు.
అంతా సీక్రెట్‌గా చేయడంలోనే అసలు గుట్టు
విజయవాడలో ఎవరైనా జేబులు కొట్టేస్తూ దొరికితే కాంతిరాణా టాటా అనే కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టి… పెద్ద ఘనత సాధించానని పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ముంబై నుంచి ప్రత్యేక విమానాల్లో వెళ్లి ఓ చిన్న నటిని తీసుకొచ్చి అరెస్టు చేసి నలభై రోజుల పాటు నిర్బంధించినా అసలు బయటకు తెలియనివ్వలేదు. ప్రభుత్వం మారిన తర్వాతే అసలు విషయం తెలిసింది, ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడే బయటపడింది. అంటే ఎంత సీక్రెట్ గా మాఫియా సెటిల్మెంట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం గూడు పుఠాణి ప్రభుత్వ పెద్దలకు తెలియకపోతే ఇంత సీక్రెట్ గా ఉంచాల్సిన పని లేదు.
ఇంకెన్ని తప్పుడు కేసులో !
క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చేతిలో వ్యవస్థలు ఉంటే.. ఎలా దుర్వినియోగం అవుతాయో దానికి జెత్వానీ కేసే ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయి. అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే.. ఆ క్రిమినల్ పాలకుడు ఏది చెబితే అది చేసిన ఐపీఎస్ అధికారుల తీరు. వారి ముస్సోరిలో ఏం నేర్చుకున్నారో.. కానీ మొత్తానికే తమ సర్వీస్ ద్రోహానికి పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థకే కళంకంగా మారారు. వారిని ఎలా శిక్షిస్తారో కానీ.. తప్పు చేసిన ఎవర్నీ వదిలి పెట్టరని ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలి.