ఆ దృశ్యం… అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే ఫలిస్తాయి.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకంటే ఉన్నత హోదాను సాధించడంతో ఆ తండ్రి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ట్రైనీ ఐఏఎస్ కూతురైన ఉమా హరతికి.. ఎస్పీ ర్యాంక్ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ కొట్టారు. ఈ అరుదైన సన్నివేశం హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో చోటు చేసుకుంది.
తెలంగాణకు చెందిన ఉమా హారతి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. పోలీస్ అకాడమీకి ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం శనివారం ఉమా హారతి హైదరాబాద్ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడే ఉన్న ఆమె తండ్రి పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తన కుమార్తెను చూసి సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.
తండ్రి ప్రోత్సాహంతో ఉమా హారతి సివిల్స్ కు ఎంపికయ్యారు. ఫాదర్స్ డే కు ముందురోజు ట్రైనీ ఐఏఎస్‌గా వచ్చిన కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారి అయిన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను ఉపేస్తున్నాయి.