తెలంగాణలో మరో రాజకీయ పార్టీ బలం పుంజుకునేందుకు సిద్ధమవుతోంది. దళితల ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసి.. బీఎస్పీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేసుకున్నారు. ముహుర్తం కూడా ఖరారు చేశారు. తన రాజీనామా లేఖలో కాన్షిరామ్ గురించి ప్రస్తావించారు ప్రవీణ్. అయితే బీఎస్పీలో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన మాత్రం.. బీఎస్పీని ఎంచుకున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతారన్న వార్తకు నేషనల్ మీడియా కూడా ప్రాధాన్యం ఇచ్చిది. స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన రాజకీయ పంధాపై ఆలోచనలు వివరిస్తున్నారు. మొత్తంగా దళితవాదమే వినిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడటం లేదు. దళితులరు రాజ్యాధికారమే లక్ష్యమని.. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ సాధ్యం కాదని ఆయన చెబుతున్నారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. అయితే .. ప్రవీణ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు ప్రయత్నించాయి. కానీ ఆయన మాత్రం.. బీఎస్పీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.