రఘురామకృష్ణరాజుపై తప్పుడు కేసు పెట్టి ఆయనను పుట్టిన రోజునాడు అరెస్ట్ చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో కేసు నమోదు కావడంతో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తిరస్కరిస్తే కేసు నమోదు చేయలేరని.. కోర్టు ధిక్కారమని చెప్పాలి కానీ.. మీ విజ్ఞతకు వదిలేస్తామని ప్రకటించడం ఆశ్చర్యకరమే. ఇలాంటి విజ్ఞత ఆయన సర్వీసులో ఉన్నప్పుడు చూపిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
జగన్ సీఎం అవగానే సీఐడీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న పీవీ సునీల్ కుమార్ ఒక్కటే టాస్క్ పెట్టుకున్నారు. జగన్ రెడ్డి నుంచి కనుసైగ వచ్చినప్పుడల్లా టీడీపీ నేతల్ని అరెస్టు చేయడం. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఉక్కుపాదం మోపడం. ఎంత మందిని అర్థరాత్రిళ్లు తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారో లెక్కే లేదు. చిన్న చిన్న టీడీపీ కార్యకర్తల్ని వదల్లేదు. చివరికి వాళ్ల ఫోన్లు స్వాధీనం చేసుకుని తిరిగి ఇచ్చే వారు కూడా. సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ మరో టాస్క్ పెట్టుకోలేదు. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల వరకూ అందర్నీ అరెస్టులు చేశారు.
ఒక్క కేసులోనూ చిన్న సాక్ష్యం కూడా చూపించలేక చార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదు. ఆ కేసుల్లో ఉన్న కుట్రల గురించి టీడీపీ ఇంకా బయటకు తీయలేదు. ఒక్క రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసును మాత్రమే బయటకు తీసింది. దీనికే ఆయన విజ్ఞత వరకూ వెళ్లారు. ఆయన విజ్ఞతకు వదిలేసినా.. టీడీపీ వాళ్లు.. పోలీసులు మాత్రం వదిలేయరు. వెంటపడటం మాత్రం ఖాయం.