విశాఖ సీపీగా పోస్టింగ్ ఇచ్చి ఆరు నెలలు కాక ముందే త్రివిక్రమ వర్మను సాగనంపేసింది జగన్ రెడ్డి సర్కార్. ఆయన స్థానంలో రవిశంకర్ అయ్యన్నార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్రివిక్రమ్ వర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా నియమించారు. మరో పది మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఇందులో కడప ఎస్పీ అన్బురాజన్ కూడా ఉన్నారు. వివేకా హత్య కేసు విషయంలో.. ఆయన తీరు వివాదాస్పదం అయింది. సీబీఐని వేధించడంలో … నిందితులపై ఈగ వాలకుండా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే చాలా కాలంగా కడపలోనే ఉండటంతో ఎన్నికల సమయంలో బదిలీ తప్పదు కాబట్టి.. పక్కనే ఉన్న అనంతపురంకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోది.
విశాఖ సీపీగా త్రివిక్రమ్ వర్మను తప్పించడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఆయనను గత ఏప్రిల్ లోనే విశాఖ సీపీగా నియమించారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బదిలీకి ప్రధాన కారణం.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారంగా భావిస్తున్నారు. ఈ అంశం విషయంలో ప్రభుత్వ పెద్దల్ని ఆయన సంతృప్తి పరచలేకపోయారని.. అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.
అయితే కీలకమైన ఈ బదిలీలు చేసే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఇండియాలో లేరు. ఆయన వ్యక్తిగత పని మీద లండన్ వెళ్లారు. ఈ సమయంలో ఇలాంటి బదిలీల ఉత్తర్వులు బయటకు రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.