ఒకరోవారం కాదు..నెలా కాదు ఏకంగా 16సం.లు ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా, కేవలం ముక్కు ద్వారా ద్రవాహారం మాత్రమే తీసుకొంటూ నిరాహార దీక్ష చేసిన ఇరాం షర్మిల ఆగస్ట్ 9న తన దీక్ష విరమించబోతున్నారు. 16 ఏళ్ళు ఏకధాటిగా తపసు చేస్తే ఆ దేవుడు కూడా దిగివస్తాడు కానీ మన ప్రభుత్వాలు మాత్రం దిగిరాలేదు. అందుకే ఇక ఈ పద్దతిలో పోరాటం ముగించి, రాజకీయాలలో చేరి ప్రజాస్వామ్యబద్దంగా పోరాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె చెప్పారు.
అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కి చెందిన కొందరు సైనికులు 2,000 సం.లో మణిపూర్ లో అకారణంగా కాల్పులు జరపడంతో 10 మంది పౌరులు మృతి చెందారు. ఆర్మీకి ప్రత్యేక అధికారాలు (ఏ.ఎఫ్.ఎస్.పి.ఎ.) ఉన్న కారణంగానే వారు అటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారని గ్రహించిన షర్మిల, వారికి ఆ అధికారాలు తొలగించాలని కోరుతూ 2000 సం.లో నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మొదట్లో ఆమె కూడా తన దీక్షకి ప్రభుత్వం దిగివచ్చి ఆర్మీకి ఉన్న ఆ ప్రత్యేక అధికారాలని తొలగిస్తుందని భావించారు. కానీ నేటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు తమ నిర్ణయం మార్చుకోలేదు. కనుక ఇంకా ఎన్నేళ్ళు నిరాహార దీక్ష చేసినా దాని వలన ఫలితం ఉండదని షర్మిల చాలా ఆలశ్యంగా గ్రహించారు. గ్రహించిన వెంటనే ఆమె దీక్షకి ముగింపు పలికి రాజకీయాలలో చేరాలని నిశ్చయించుకొన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 44 సం.లు. పట్టుదలగా ఇన్నేళ్ళు నిరాహార దీక్ష చేసినా తన లక్ష్యం నెరవేరలేదని నిరాశ చెందకుండా, రాజకీయాలలో ప్రవేశించి దానిని నెరవేర్చుకోవాలని అనుకోవడం ఆమె ఆశావహ, సానుకూల దృక్పధానికి అద్దం పడుతోంది. అందుకే ఆమెని అందరూ ఐరన్ లేడి అని గౌరవిస్తారు. 2017లో మణిపూర్ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఆలోగా ఆమె తన స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొని ఎన్నికలకి సిద్దం కావచ్చు.