గత రెండు నెలలుగా కరోనా వార్తకు తప్ప మరో దానికి ప్రాధాన్యత లేదు. జనాలు కూడా వాటికే అలవాటైపోయారు. సోషల్ మీడియాలో అయితే #కరోనా హ్యాష్ మాత్రమే ట్రెండింగ్ లో వుంది. అయితే ఈ రోజు సోషల్ మీడియాలో ఓ కొత్త పేరు కరోనాని వెనక్కి నెట్టేసింది. సోసల్ మీడియా ఎకౌంట్లు ఓపెన్ చేసిన వెంటనే కామన్ గా కనిపించే పోస్ట్ ఇర్ఫాన్ ఖాన్. దేశ ప్రధాని మొదలు .. సామాన్యడి వరకూ ఇర్ఫాన్ ఖాన్ ప్రతిభని మెచ్చుకొని ఆయనకి తుది వీడ్కోలు పలికారు.
ఎందుకంటే ఇర్ఫాన్ ఖాన్ సామాన్యనటుడు కాదు. బేసిగ్గా ప్రముఖులు చనిపోయినప్పుడు ఆయన లేని లోటు పూడ్చలేనిదనే కామన్ కోట్ వాడుతుంటారు. ఈ మాటకు నూటికి నూరు శాతం అర్హుడు ఇర్ఫాన్ ఖాన్. ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకు తీరనిది. ఒకటి, రెండు కాదు.. ఇర్ఫాన్ ఏ సినిమా చేసినా అందులో ఆయన పాత్ర గుర్తుండిపోతుంది. కారణం అతడు నటించడు. పాత్రని అర్ధం చేసుకొని బిహేవ్ మాత్రమే చేస్తాడు. అదే ఆయనకి విశేష గుర్తింపు తెచ్చింది. వెండితెరపై చెరగని సంతకం వేయించింది.
ఆయన చూపిన ప్రతిభ ఎంతటిదంటే.. ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ఇర్ఫాన్ ని గుర్తుకు తెచ్చుకొని కొందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పేరు కరోనాని పక్కకు నెట్టి ముందు వరుసలో నిలిచిందంటే ఇది ఇర్ఫాన్ గొప్పదనం. ఇండియన్ సినిమా గొప్పదనం. సినిమాని జీవితంలో భాగం చేసుకున్న ప్రతి ప్రేక్షుకుడి గొప్పదనం.