కృష్ణా జిలాలపై తెలంగాణలో రాజకీయం రాజుకుంటోంది. డ్యాముల్లో ఉన్న నీటిని ఏపీ తరలించుకుపోతోందని కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రోజుకొకరు చొప్పున ప్రెస్మీట్ పెట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే.. ప్రాజెక్టుల్లో నీరును ఇష్టారాజ్యంగా తీసుకునే అవకాశం రెండు ప్రభుత్వలకూ లేదు. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డుల్లోరెండు ప్రభుత్వాల ప్రతినిధులూ ఉంటారు. అందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు నీరు తీసుకుంటారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు డ్యాముల్లో ఉన్న నీరంతా తెలంగాణదేనని కానీ ఏపీ తీసుకెళ్తోందని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఏడాది సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. డ్యాములు నిండాయి. కానీ చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాని దశలో ఉండటం వల్ల నీటి నిల్వ గరిష్టంగా చేసుకోలేకపోయారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితి ఉంది. అయితే గతం కన్నా.. ఈ ఏడాది రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కానీ నీటి విషయంలో ఏదో జరుగుతోదంని రాజకీయం చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలనే ఆలోచనను రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. డైవర్షన్ గేమ్ అని రెండు పార్టీలు ఆరోపించుకుంటున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఏపీ కృష్ణా నుంచి నీళ్లు ఎలా తీసుకుంటుందో ఇప్పుడూ అలాగే తీసుకుంటోంది. కృష్ణా బోర్డు కేటాయింపుల మేరకే నీరు తీసుకుంటుంది. అంత కంటే ఎక్కువ తీసుకుంటే.. కృష్ణాబోర్డు ఊరుకోదు. ఆ విషంయ అందరికీ తెలుసు. కృష్ణా లో ఎవరెవరు ఎంత ఎంత వాటా తీసుకోవాలో గతంలో నిర్ణయించారు. అది సరిపోదు సగం సగం కావాలని తెలంగాణ వాదిస్తోంది. ఇంకా నిర్ణయం జరగకముందే దానిపై రాజకీయం జరుగుతోంది.
గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం రాత్రికి రాత్రి సాగర్ డ్యామ్ మీద రచ్చ చేయడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం అధీనంలోకి తీసుకుంది. ఓటింగ్ రోజు ఏపీ పోలీసులు .. ప్రభుత్వ ఆదేశాలతో చేసిన అతితో ఇది జరిగింది. దానిపై ప్రజలు ఆవేశపడలేదు. రాజకీయ కుట్రలేమిటో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు.. కూడా కృష్ణా జలాలపై రాజకీయాలు ప్రారంభించారు. ఇలాంటివి రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి.దీని వల్ల రాజకీయంగా .. కొంత మందిని రెచ్చగొట్టి లాభపడతామో కానీ.. అంతిమంగా ప్రజలే నష్టపోతారని నాగార్జున సాగర్ ఇష్యూ ద్వారా వెల్లడయింది. అయినా రాజకీయ నేతలు మాత్రం సెంటిమెంట్ రాజకీయాల కోసం నీళ్ల మీద రాజకీయ నిప్పులు పోసేందుకు రెడీఅవుతున్నారు.