జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత… ఢిల్లీ సర్కిల్స్‌లో జోరుగా వినిపించిన ఓ గాసిప్… ఏపీ నుంచి రాజ్యసభకు అదానిని పంపించాలని బీజేపీ నుంచి జగన్‌కు అందిన రిక్వెస్ట్. దానికి జగన్ సానుకూలంగా స్పందించారని కూడా చెబుతున్నారు. అదానీ గ్రూప్ యజమాని అయిన గౌతమ్ అదాని చట్టసభసభ్యుడు అవ్వాలని ఆశ పడుతున్నారు. రాజ్యససభ సభ్యుడిగా ఉండే ప్రివిలేజెస్ వేరు. ఆయన ఆసక్తిని బీజేపీ గమనించింది. అయితే ఆయనకు బీజేపీ తరపున నేరుగా రాజ్యసభకు పంపే అవకాశం లేదు. ఇప్పటికే అంబానీ.. అదానీల కోసమే బీజేపీ పని చేస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
దేశ ప్రజల దృష్టిలోనూ అదే ముద్ర పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయనను బీజేపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం దాదాపుగా లేనట్లే. అందుకే.. మితపక్షం లాంటి పార్టీ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తోందని అంటున్నారు. అలాంటి మిత్రపక్షం వైసీపీనే. ఇప్పటికే… రిలయన్స్ సామ్రాజ్యం నుంచి ఒకరిని వైసీపీ రాజ్యసభకు పంపింది. మరొకర్ని.. పంపడానికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఏపీలో ఎప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరిగినా.. మొత్తం వైసీపీకే దక్కుతాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీలో అదానీ రాజ్యసభ సీటుపై చర్చ జరుగుతోంది.
బడా పారిశ్రామికవేత్తలు… పెద్దల సభలో ఉండాలని కోరుకుంటూ రావడం ఎక్కువైంది. ఒకప్పుడు విజయ్ మాల్యా అలా ఉండేవారు. తర్వాత ఇతర పారిశ్రామికవేత్తలూ ఆ జాబితాలో చేరారు. బడా సంస్థల అధిపతులు తాము కాకపోయినా.. తమ సంస్థ నుంచి ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటున్నారు. అదానీకి ఆసక్తి ఉంటే మాత్రం… బీజేపీ హైకమాండ్ నిజంగా సిఫార్సు చేసి ఉంటే మాత్రం… వైసీపీ సభ్యుడుగా అదానీ రాజ్యసభలో అడుగు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది.