అఖిల్ సినిమా ఫ్లాప్ తో అఖిల్ చాలా నిరుత్సాహానికి లోనయ్యాడు. రెండో సినిమా విషయంలో మరింత జాప్యం జరగడానికి కారణం అదే. ఏదైతేనేం.. విక్రమ్ కె.కుమార్లాంటి దర్శకుడ్ని పట్టేశాడు. హలో అనే క్యాచీ టైటిల్ దానికి తోడైంది. నాగ్‌కి అచ్చొచ్చిన డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కావడం, దానికి తోడు క్రిస్మస్ సెలవలు కలసి రావడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. కాకపోతే ఒకటే అడ్డు. నాని – ఎంసిసీ సరిగ్గా హలోకి ఒక్క రోజు ముందు విడుదలైంది. నాని క్రేజ్ మామూలుగా లేదు. తన సినిమా అంటే తప్పకుండా చూడాల్సిందే అనుకుని థియేటర్లకు వెళ్లిపోతున్నారు జనాలు. అఖిల్‌కీ అదే భయం పట్టుకొంది. రెండు సినిమాలు ఇంచు మించు ఒకేసారి విడుదల అవుతున్నప్పుడు తప్పకుండా తొలి ఆప్షన్ నానినే అవుతాడు. అందుకే హలోకి బ్రేక్ వేసే శక్తి.. నాని ఎంసీఏకే ఉంది.
అయితే.. ఇప్పుడు నాని సినిమా రిజల్ట్ వచ్చేసింది. ఈ సినిమా మరీ అంత బ్యాడ్ గా లేకపోయినా – అంచనాల్ని అందుకోకపోవడం నిరాశ పరిచే విషయమే. నాని సినిమా, అందులోనూ దిల్ రాజు ప్రాజెక్టు, దానికి తోడు ఫిదా తరవాత సాయి పల్లవి నుంచి వస్తున్న సినిమా – ఇవన్నీ వెరసి ఎంసీఏపై ఒత్తిడి పెంచేశాయి. అయితే… ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోవడం విఫలమైంది. ”దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యింది” అనీ, నాని నమ్మకాల్ని వమ్ము చేశాడని అప్పుడే సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది కచ్చితంగా హలోకి కలిసొచ్చే పాయింటే. రేపటి నుంచి రెండు ఆప్షన్లు ఉండవు. హలో బాగుంటే అది హిట్టవ్వడం ఖాయం. అదీ కాస్త అటూ ఇటూగానే ఉంటే… నాని యావరేజ్ సినిమా కాస్త.. నిలబడిపోవడం ఇంకా ఖాయం.