అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈలోగా ఈ సినిమా కథకీ అలనాటి ఎన్టీఆర్ చిత్రం `ఇంటిగుట్టు`కీ దగ్గర పోలికలున్నాయని, ఆ సినిమానే అటూ ఇటూ మార్చి తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ త్రివిక్రమ్ మాత్రం చిరుబురులాడుతున్నాడు. ఈ లీకులకు కారణం తన సహాయ దర్శకులేనని త్రివిక్రమ్ అనుమానం. అందుకే.. సహాయ దర్శకులందరినీ పిలిచి మరీ క్లాస్ పీకాడట. ఈ విషయం బయటకు ఎలా వెళ్లిందని? ఇలాంటి లీకులు ఇక మీదటా జరిగితే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. అయితే ఇప్పటికే ఈ సినిమాపై కూడా `కాపీ` ముద్ర పడిపోయింది. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో కూడా త్రివిక్రమ్ అండ్ టీమ్‌కి తెలియడం లేదు. ‘ఇంటి గుట్టు’ సినిమా చూసి, దాంతో ‘అల వైకుంఠపురంలో’తో పోలికలు వెదికేవాళ్లు మొదలైపోతారు. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూస్తే.. ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. రేపొద్దుట.. ఈ విమర్శలు ఎక్కువైతే తట్టుకోవడం కష్టం. ‘అఆ’ విషయంలోనూ ఇదే జరిగింది. టైటిల్స్‌లో యద్దనపూడి సులోచనారాణికి క్రెడిట్ ఇవ్వకుండా త్రివిక్రమ్ ఓ పొరపాటు చేశాడు. ‘అజ్ఞాతవాసి’ కూడా కాపీ ముద్రని మోసింది. ఈసారీ త్రివిక్రమ్‌కి ఈ బాధ తప్పదేమో..?