ఇండస్ట్రీలో చిరంజీవిగా, చిరు మొక్కగా మొదలైన మెగాస్టార్ ప్రస్థానం నేడు మహావృక్షంగా స్థిరపడింది. మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మందికి పైగా స్టార్ హీరోలున్నారు. తెరమీద వీళ్ళు ఇంత పెద్ద హీరోలు కావడానికి చిరంజీవి ఇమేజ్ ఒక కారణం అయితే తెర వెనుక చక్రం తిప్పింది మెగా నిర్మాత అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీ హీరోలకు ఏదైనా సమస్య వస్తే ముందుగా రంగంలోకి దిగేది ఆయనే. అలాంటి వ్యక్తి కన్న కొడుకు సినిమాకి సమస్య వస్తే ఊరుకుంటారా? ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల విడుదల విషయంలో తెరవెనుక ఒకరు మీద మరొకరు కత్తులు దూసుకుంటున్న సంగతి తెలిసిందే. ముందు ఏప్రిల్ 27 అని, తర్వాత ఏప్రిల్ 26 అని పోటాపోటీగా విడుదల తేదీ ప్రకటించారు. హీరోల ఈగోలు, డిస్ట్రిబ్యూటర్ల భయాలు బయటపడడంతో రాజీ కోసం చర్చలకు దిగారు. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ స్వయంగా చర్చల్లో పాల్గొంటున్నారని సమాచారం. ఆయనతో పాటు కె.ఎల్. నారాయణ, ‘జెమిని’ కిరణ్ రాజీ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ‘జెమిని’ కిరణ్ పదవిలో ఉన్నారు. అందుకని, ఆయన్ను చర్చలకు ఆహ్వానించారు. కె.ఎల్. నారాయణను తీసుకురావడం వెనుక చిత్రమైన కథ దాగుంది. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన ఆయన దగ్గర మహేశ్, రాజమౌళి డేట్లు వున్నాయి. కె.ఎల్. నారాయణకు మహేశ్ హీరోగా సినిమా బాకీ వుందని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. అందుకని మధ్యవర్తిగా ఆయన్ను తెచ్చారు. కొడుకు కోసం స్వయంగా అల్లు అరవింద్ చర్చల్లోకి వచ్చారు. రాజీ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. చర్చలు సఫలమైతే గురువారం లేదా శుక్రవారం ఏదో సినిమా విడుదల తేదీ మారడం కన్ఫర్మ్. ఏప్రిల్ 26ను విడుదల తేదీని వదులుకుని ముందుకు ఏడ వెనక్కి ఎవరు జరుగుతారో చూడాలి. ఇండస్ట్రీ జనాలు ఈ సమస్యను నిశితంగా గమనిస్తున్నారు.