చిత్తూరు జిల్లాను పారిశ్రామికంగా ప్రపంచం దృష్టిలో పడేలా చేసిన అమరరాజా కంపెనీ .. తమ వ్యాపార విస్తరణను తమిళనాడులో చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న “అమరాన్” బ్యాటరీలను అమరరాజా సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అమెరికాలో స్థిరపడినప్పటికీ.. సొంత గడ్డపై ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో గల్లా రామ చంద్రనాయుడు చిత్తూరులో అమరరాజాను స్థాపించి.. అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లారు. ఎంత వ్యాపార విస్తృతి వచ్చినా… కొత్త కొత్త రంగాల్లోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకూ చిత్తూరు జిల్లాలోనే ఫ్యాక్టరీలు పెడుతూ వస్తున్నారు. మరో చోట పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు.
ఏపీ ప్రభుత్వ వేధింపులతో మారిన అమరరాజా మైండ్..!
తమిళనాడులో తమ విస్తరణ ప్రణాళికలు అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. ఇటీవలే గల్లా రామచంద్రనాయుడు సంస్థ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి కాలంలో సంస్థ వ్యాపార పరంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాజకీయంగా కక్ష సాధించేందుకు ఓ సారి భూముల కేటాయింపు రద్దు.. మరోసారి పొల్యూషన్ పేరుతో ఉత్పత్తి నిలిపివేత.. లాంటి చర్యలు చేపట్టడంతో… ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. చివరికి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఇప్పటికీ ఏదో రూపంలో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాము చిత్తూరులో పెట్టాలనుకున్న లిథియం ఆయాన్ సెల్స్ తయారీ యూనిట్‌ను తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడి సీఎంతో చర్చలు కూడా జరిపారు. భూమి పరిశీలన కూడా పూర్తయిందని అమరరాజా వర్గాలు చెబుతున్నాయి.
లిథియం ఫ్యాక్టరీ చిత్తూరులోనే పెడుతున్నామని గతంలో ప్రకటన..!
నిజానికి లిథియం ఆయాన్ సెల్స్ తయారీ యూనిట్‌ను కూడా చిత్తూరులోనే పెట్టాలనే అమరరాజా గతంలో నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన కూడా చేసింది. విద్యుత్ వాహనాల ఉత్పత్తి పెరిగిపోతున్నందున.. వాటి కోసం.. బ్యాటరీలను తయారు చేసే టెక్నాలజీ సెంటర్‌ను తిరుపతిలో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇండియన్ ప్రైవేట్ సెక్టార్లో మొదటి లిథియం అయాన్ సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ తిరుపతిలోనే వస్తోందని అమర రాజా బ్యాటరీస్ సీఈఓ అప్పట్లో ప్రకటించారు. ఇందు కోసం టెక్నాలజీ అవసరం కాగా… ఇస్రోతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఇస్రోతో ఒప్పందం కొనసాగుతుంది. కానీ ప్లాంట్ మాత్రం తమిళనాడుకు వెళ్తుంది.
తెలంగాణ కూడా అమరరాజాను ఆహ్వానిస్తోంది..!
పారిశ్రామిక సంస్థల కోసం రాష్ట్రాలు పోటీ పడుతూంటాయి. రాయితీల మీద రాయితీలు ఇస్తామని చెబుతూ ఉంటాయి. దీనికి కారణం ఒక్క సారి పరిశ్రమ ఏర్పాటైతే.. ఆ పరిశ్రమ ద్వారా.. తమ యువతకు ఉద్యోగాలు రావడమే కాదు… ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. అందుకే ఏ ప్రభుత్వమైనా.. ఎంత రాజకీయ కక్షలు ఉన్నా… పరిశ్రమ జోలికి మాత్రం వెళ్లవు. తెలంగాణలో అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా.. అక్కడ ఎంతో మంది రాజకీయ నేతల వ్యాపారాలు… పరిశ్రమలు ఉన్నా.. ఏనాడూ వాటి జోలికి అక్కడి ప్రభుత్వం వెళ్లలేదు. అందుకే అక్కడ పారిశ్రామిక వాతావరణంపై పాజిటివ్ వేవ్ ఉంది. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. పరిశ్రమలు ఏపీకి రాకపోయినా.. ఏపీ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదన్న అభిప్రాయంలో ప్రభుత్వ పెద్దలున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కియా అనుబంధ పరిశ్రమలు కూడా చెన్నైకి వెళ్లిపోయాయని అంటున్నారు. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే… అమరరాజా తమ ప్రధాన యూనిట్‌ను కూడా చెన్నైకు తరలించినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విశేషం ఏమిటంటే… తెలంగాణ సర్కార్ కూడా అమరారాజా సంస్థకు ఆహ్వానం పలికింది. దీనిపైనా చర్చలు జరుగుతున్నాయట.