అది 2014… పోటీ చేయడానికి ఎన్డీఏ అనే కూటమిలో పోటీ చేసినా.. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. బీజేపీ అధ్యక్షునిగా.. నరేంద్రమోడీ ఏరికొరి.. తన గుజరాత్ సహచరుడు అమిత్ షాను.. అధ్యక్షునిగా ఎంపిక చేసుకున్న తర్వాత.. బీజే్పీకి కొమ్ములు కూడా వచ్చాయి. సర్వం తామే అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. పార్టీలోనే అయితే..అది వారి అంతర్గత వ్యవహారం. మిత్రపక్షాలకు కూడా తానే అధ్యక్షుడన్నట్లుగా తయారైందీ అమిత్ షా వ్యవహారం. ఏ విషయంలోనూ.. సలహాలు, సూచనలు తీసుకున్న పాపాన పోకపోగా… మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలను.. ఆయా రాష్ట్రాల్లో నిర్వీర్యం చేసి… ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలని.. చాలా పెద్ద పెద్ద ప్లాన్లే వేసుకున్నారు. ఫలితంగా.. ఒక్కో పార్టీ నమస్కారం పెట్టేసింది. అమిత్ షా ఎంత దారుణమైన రాజకీయం చేసేవారంటే.. ముఫ్పై ఏళ్లుగా మిత్రపక్షంగా ఉన్న శివసేనను కూడా నిర్వీర్యం చేసి.. బీజేపీని బలపరచాలనుకున్నారు. అది తెలిసి.. శివసేన.. బీజేపీపై పంజా విసురుతోంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి..ఒక్కో పార్టీ గుడ్ బై చెబుతోంది.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరవాత.. ఆ కూటమి అస్థత్వం దాదాపుగా ప్రశ్నార్థకం అవుతోంది. ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీకి లాయర్‌గా కనిపించడం లేదు. శివసేన ఒంటరి పోటీకే సై అంటోంది. ఒక వేళ కలసి పోటీ చేయాలనుకుంటే… శివసేనకు మెజార్టీ సీట్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే బీజేపీలో అసంతృప్తి పెరుగుతుంది. ఇక బీహార్ నుంచి.. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచిన కుష్వాహా పార్టీ బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ రాహుల్ గాంధీని ప్రశంసించారు. యువకులు, రైతులకు సంబంధించిన నిజమైన సమస్యలను రాహుల్ లేవనెత్తారని, ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆయన లెవనెత్తిన అంశాలు దోహదం చేశాయని అన్నారు. పొత్తుల విషయం చాలా సున్నితమైనందున ఎన్డీయే భాగస్వాముల ఆందోళనను బీజేపీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. లోక్‌జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా.. కాంగ్రెస్‌తో మంతనాలు జరిపినట్లు తేలడంతో.. అమిత్ షా .. పరుగులు పెట్టి మరీ పాశ్వాన్ వద్దకు పోయారు. బీహార్‌లో పార్లమెంట్ సీట్లు ఇస్తామంటూ.. బేరం పెట్టారు.
కానీ పాశ్వాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఆర్జేడీతో పోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసి.. ఇటీవలి కాలంలో ఎన్డీఏలో చేరిన నితీష్ కుమార్ … కూడా… అయితే ఒంటరిగా అయినా పోటీ చేసుకుంటే పరువు నిలుస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే.. మోడీ కారణంగా.. జేడీయూ ఓటు బ్యాంక్ చిన్నాభిన్నమైంది. ఎన్నికలకు ముందుగా ఆయన బీజేపీకి హ్యాండిచ్చినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. అధికారం పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నప్పుడు.. మిత్రపక్షాలను కాలి కింద చెప్పుల్లా చూసిన బీజేపీ అగ్రనేతలకు ఇప్పుడు… అసలు పరిస్థితి అర్థమవుతోంది. మిత్రులు లేని వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఇది తెలిసీ మరీ టెన్షన్్కు గురువుతున్నారు.