తెలుగుదేశం నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మార్పు ముహూర్తం దాదాపు ఖరారు అయిపోయినట్టే! సొంత పార్టీపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య టీడీపీ నిర్వహించిన మినీ మహానాడు కూడా ఆయన హాజరు కాకపోవడం, ఇదే సందర్భంలో పార్టీపై విమర్శలు చేస్తూ ఉండటంతోనే ఆయన టీడీపీని వీడటం ఖాయమని ఖారారు అయిపోయింది. అయితే, ఆయన వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. ఇంకోపక్క, కాంగ్రెస్ నేతలతో కూడా ఇటీవీలే ఆనం సమావేశం కావడంతో… మరోసారి కాంగ్రెస్ కి వస్తారా అనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఎట్టకేలకు ఆయన వైకాపా చేరడం ఖాయమనే ప్రచారమే బలంగా జరుగుతోంది.
వచ్చేనెల తొలివారంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి ఉంది. సరిగ్గా ఆరోజునే జగన్ సమక్షంలో ఆనం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి, వైకాపాలోకి ఆయన్ని ఆహ్వానించేందుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నెల 2నే ఆనం ఇంటికి స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు. అక్కడే నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. వైకాపాలో చేరేందుకు అక్కడే ఓ అంగీకారం కుదిరిందనీ, పార్టీలో సముచిత స్థానం ఇస్తామన్న భరోసా కూడా వైకాపా అధినేత మాటగా ఆయనకి అందిందని తెలుస్తోంది.
పార్టీలో సముచిత స్థానం తనకు దక్కడం లేదన్నదే ఆనం సోదరుల ఆరోపణ! ఇదే అసంతృప్తిని కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు వ్యక్తం చేస్తే… కొద్దిరోజులు ఓపిక పట్టండీ, గుర్తింపు కచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తరువాత, ఆనం వివేకా మరణం సందర్భంగా స్వయంగా రామనారాయణ రెడ్డి కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. దాదాపు గంటకుపైగా వారితో ఏకాంతంగా చర్చించి, రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. మొత్తానికి, ఈ బుజ్జగింపులేవీ వర్కౌట్ కాలేదు. ఆయన వైకాపా చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే.. వైకాపాలో చేరగానే ఆయనకు ప్రత్యేకంగా లభించే గుర్తింపు అంటూ ఏమైనా ఉంటుందా..? అంటే, వచ్చే ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై క్లారిటీ తప్ప, ప్రత్యేకంగా లభించేది అంటూ ఏదీ ఉండదనే చెప్పాలి. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు పార్టీ మారడం వల్ల ఆయనకి వస్తున్నదేంటీ.. అంటే, ఏమీ లేదు! పైగా, జిల్లాలో ఇప్పటికే దాదాపుగా ప్రముఖ నియోజక వర్గాల్లో వైకాపా కీలక నేతలే ఉన్నారు. ఇప్పుడు ఆనం కోసం ఎవరో ఒకర్ని పక్కకు తప్పించాల్సిన పరిస్థితి. పోనీ, ప్రముఖ నాయకుడిగా అయినా పార్టీలో పెద్దపీట వేసి, ముందు వరుసలో కూర్చోబెడతారా అంటే అదీ అనుమానమే. అక్కడంతా ఏకవ్యక్తి ప్రాధాన్యంగా ఉంటుందని చాలామంది ఆరోపిస్తుంటారు. మరి, ఆనం చేరిక తరువాతైనా ఆ పరిస్థితిలో కొంత మార్పు వస్తుందేమో చూడాలి.