ప్రత్యేకహోదా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఇరవైకిపైగా ఎంపీలు గెలిస్తే.. కేంద్రాన్ని శాసించి… ప్రత్యేకహోదా తీసుకు రావాలని ఆయన భావించారు. అయితే.. కేంద్రంలో నెంబర్ మ్యాజిక్‌లు ఏమీ లేకపోవడంతో… వైసీపీ వర్గాలు కాస్త డీలా పడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కాదు. ఆయన మాత్రం పట్టుదలగానే.. ప్రత్యేకహోదా కోసం పోరడాలని నిర్ణయించుకున్నట్లుగా… ప్రమాణస్వీకారానికి ముందే… ఆయన చేతలతో నిరూపిస్తున్నారు.
వైసీపీ ఎంపీలకు సింగిల్ లైన్ ఎజెండా ప్రత్యేకహోదా..!
వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎంపీలకు..జగన్మోహన్ రెడ్డి.. సింగిల్ లైన్ ఎజెండా నిర్దేశించారు. గెలిచిన తరవాత తొలి సారి జరిగిన సమావేశంలోనే… ఎంపీల నుంచి తాను ఎలాంటి పనితీరును ఆశిస్తున్నది నేరుగానే చెప్పారు. పార్లమెంట్ తొలి సమావేశాల నుంచి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరం అయితే.. మరోసారి పదవులకు రాజీనామాలు చేయడానికి కూడా సిద్దంగా ఉండాలని… ఆదేశించారు. ఎంపీలు కూడా.. జగన్మహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయబోమని… అధినేత ఆశించినట్లుగా పోరాడి ఫలితాన్ని సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. కేంద్రంలో తమ అవసరం బీజేపీకి లేదన్న.. భావన ఏమీ లేకుండా.. పోరాడితే సాధించొచ్చన్న మొదటి పాయింట్‌ను జగన్‌తో పాటు ఎంపీలూ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కేసీఆర్ నుంచి సంపూర్ణ మద్దతు పొందిన జగన్..!
ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానించే క్రమంలో మొట్టమొదటి సారిగా ప్రగతిభవన్‌కు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదాను మనసులోనే ఉంచుకున్నారు. కేసీఆర్‌తో జరిగిన కర్టెసీ చర్చల సమయంలోనూ.. హోదా అంశం.. వారి మధ్య చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు… ముందు చెప్పినట్లుగానే సంపూర్ణ సహకారం అందిస్తామని.. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలిసి.. ఈ హోదా పోరాటం చేద్దామని ఆయన ప్రతిపాదించారు. పార్లమెంట్లో హోదా విషయంలో.. మద్దతుకు హామీ ఇచ్చారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా… మద్దతు వ్యతిరేకించే పరిస్థితి లేదు. బీజేపీ కూడా.. అంతే. అంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి హోదా కోసం 42 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇది ఓ రకంగా..జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్.
ప్రధానితో తొలి భేటీలోనూ “ప్రత్యేకహోదా”..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో… మర్యాదపూర్వకంగా జరిగే తొలి భేటీలోనూ జగన్ ప్రాధాన్యతాంశం.. ప్రత్యేకహోదానే. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేందుకు జగన్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన అంశాలను.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అందులో భాగంగానే…జగన్ ప్రస్తావించబోయే మొదటి అంశం.. ప్రత్యేకహోదా అంటున్నారు.
ఇవన్నీ… ప్రత్యేకహోదా విషయంలో .. జగన్మోహన్ రెడ్డి పట్టుదలను చూపిస్తున్నాయి. గత పదేళ్లుగా ఆయన చేసిన అవిశ్రాంత రాజకీయ పోరాటంతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా హోదా విషయంలో అదే పట్టుదల చూపి.. అనుకున్నది సాధిస్తారన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.