హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతిపై రాజకీయపార్టీల నుండి ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా స్పందిస్తున్నాయి. రోహిత్ తల్లిని పరమార్శించేందుకు అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ పరామర్శ పూర్తయిన తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఇవ్వాళ్ళ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపిఎం నేత సీతారం ఏచూరి, బీ.ఎస్.పి. అధినేత్రి మాయావతి, ఆర్.పి.ఐ. నేత రాందాస్ అధ్వాలే మొదలయిన వారు రోహిత్ తల్లిని పరామర్శించదానికి వస్తున్నారు. ఆమె చేతికి అందివచ్చిన కొడుకుని కోల్పోయి బాధపడుతుంటే, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు అందరూ ఈ విషాద సంఘటన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఆత్రుతతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అక్కడి నుండి ఆమె వద్దకు క్యూ కట్టి వస్తున్నారు. దాని వలన ఆమె కడుపుకోత చల్లారదు కానీ అందరూ కలిసి ఆ గాయాన్ని కెలికినట్లవుతోంది.
ఇదివరకు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలకు పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేసిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వచ్చే నెలనుండి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో, కేంద్ర మానవ వనరుల అభివృది శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇద్దరూ రోహిత్ మృతికి కారకులని ఆరోపిస్తూ వారి రాజీనామాలకు పట్టుబడుతుందేమో? ఈ విషాద ఘటనపై చాలా తీవ్రంగా స్పందిస్తున్న రాజకీయ పార్టీలన్నిటినీ గమనించినట్లయితే, అవన్నీ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవేనని అర్ధం అవుతుంది. అంటే బీజేపీ పట్ల వాటికున్న వ్యతిరేకత వాటన్నిటినీ ఈ సంఘటనతో ఒక్క త్రాటిపైకి వస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. కనుక శవరాజకీయాలు చేయడానికి తరలివస్తున్న రాజకీయ నేతలను విద్యార్ధులు దూరంగా ఉంచితే మంచిది.