భారతీయ జనతా పార్టీ తరపున బహిరంగసభలో ప్రసంగించడానికి జనవరి ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు… దీన్నో అవకాశంగా తీసుకున్నారు. ప్రజల్లో “మోడీ” సెంటిమెంట్ పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మోడీ వచ్చినంత మాత్రాన.. బీజేపీ బావుకునేది ఏమీ ఉండదు. బీజేపీ అధికారంలో ఉండి.. తిరుగులేని బలం ఉన్న చోట్లనే.. మోడీ ప్రచారం చేయడం వల్ల.. సీట్లు, ఓట్లు పెంచుకోలేకపోయారు. అంత ఎందుకు… తెలంగాణలో ఆయన మూడు చోట్ల బహిరంగసభల్లో ప్రసంగిస్తే… వచ్చింది.. ఒకే ఒక్క అసెంబ్లీ సీటు. మోడీ వల్ల బీజేపీకి ఒక్క ఓటు లాభం వస్తుందో లేదో కానీ… అదే మోడీ వల్ల.. తను మ్యాగ్జిమం లాభం పొందడానికి చంద్రబాబు పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మోడీ రావాలనేదే చంద్రబాబు కోరికా..?
తెలంగాణలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ఎలా ఓట్లు చేసుకున్నారో.. చంద్రబాబు కూడా… అదే పద్దతిలో ఫాలో అవుతున్నారు. ఓ పద్దతి ప్రకారం ప్రజల్లో యాంటీ మోడీ సెంటిమెంట్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటగా… ప్రతీ రోజూ శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రారంభించారు. ఇవన్నీ.. అధికారిక లెక్కలు. ఇవి ప్రజల్లోకి ఎలా వెళ్తాయో చెప్పలేం. కానీ.. ఓ చర్చ అయితే జరుగుతుంది. చంద్రబాబుకు అదే కావాలి. విభజన హామీలపై ప్రజల్లో చర్చజరగాలి.. అప్పుడే మోడీ ఏం చేశారో తెలుస్తుంది. అదే ప్లాన్ తో శ్వేతపత్రాలు ప్రారంభించారు. అనుకున్నట్లుగానే… చర్చ ప్రారంభమయింది. అదే సమయంలో.. మోడీపై…చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు ప్రారంభించారు.
మరి నిరసనలకు ఎందుకు పిలుపులు..?
చచ్చామో.. బతికామో చూడటానికి వస్తున్నారా..? అంటూ ప్రారంభించారు. రోజుకో ఘాటు వ్యాఖ్య చేస్తున్నారు. దానితో పాటు బుధవావరం అనంతపురం ధర్మపోరాట సభలో… హామీలు అమలు చేసిన తర్వాతే… ఏపీకి రావాలన్న డిమాండ్ వినిపించారు. ఇవి ముందు ముందు మరింత పెరగనున్నాయి. అలాగే.. నిరసన కార్యక్రమాలు సహజంగానే ఉంటాయి. టీడీపీ తరపున ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలంతా పని గట్టుకుని బీజేపీ తీరును విమర్శించడం ప్రారంభించారు. రోజులు గడిచే కొద్దీ ఇవి పెరుగుతూ ఉంటాయి. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే.. విపక్ష కమ్యూనిస్టు పార్టీలు కూడా..మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. తాము టీడీపీ వైపు అనుకుటారేమోనన్న ఉద్దేశంతో.. చంద్రబాబును విమర్శిస్తూనే వారు ఈ నిరసనలు చేపట్టబోతున్నారు. ఇక విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజాసంఘాల హడావుడి.. సరేసరి.
జనసేన, వైసీపీలు ఇరుక్కుపోవడం ఖాయమేనా..?
మోడీ ఏపీ పర్యటనతో ఇరుక్కుపోయేది.. వైసీపీ, జనసేన పార్టీలే. కారణాలేమైనా కానీ.. వారు నరేంద్రమోడీని ఒక్క మాట అనడానికి సాహసించలేకపోతున్నారు. మోడీ ఏపీ పర్యటనపైనా వారు స్పందించడం లేదు. వైసీపీ అయితే.. ఆయనకు మద్దతుగా… సాక్షి మీడియాలో .. వాదనలు ప్రారంభించింది. ఇక జనసేన అధినేత యూరప్ టూర్లో ఉన్నారు. ఆయన ఏ మాత్రం… మోడీని వ్యతిరేకించే పరిస్థితి లేదని.. ఇటీవలి కాలంలో జరిగిన అనేక పరిణామాలు నిరూపించాయి. అందుకే.. చంద్రబాబు వైసీపీ, జనసేన మోడీ పర్యటనపై ఎందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించడం ప్రారంభించారు. దీనికి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చి పడింది.
ఏ విధంగా చూసినా మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సమయానికి.. ఈ ఏపీలో ఈ యాంటీ మోడీ సెంటిమెంట్‌ను తారస్థాయికి తీసుకెళ్తే… అంతిమంగా లాభపడేది టీడీపీనే. దీనిపై వైసీపీ, జనసేన, బీజేపీలు విరుగుడుగా ఏమి చేస్తాయో..?
—– సుభాష్