భాగమతి సినిమా పూర్తయిపోయింది. మొన్నే టీజర్ కూడా వచ్చింది. అయితే భాగమతి కథేంటి? ఇదే జోనర్ సినిమా అనే ప్రశ్నలకు మాత్రం ఇంత వరకూ సమాధానం దొరకలేదు. ఇదో హారర్ అని, థ్రిల్లర్ అని, పునఃజన్మ కథ అని, అరంధతిలా ఉంటుందని రకరకాల ఊహాగానాలున్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదో పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. అయితే దర్శకుడు తెలివిగా.. 500 ఏళ్ల క్రితం జరిగే మరో కథకి లింకు పెట్టాడట. అంటే.. అనుష్కని రెండు పాత్రల్లో చూడబోతున్నామన్నమాట. ఐదొందల యేళ్లక్రితం ఓ పాత్ర, ప్రస్తుతం ఓ పాత్ర అన్నమాట. ఈ రెండు పాత్రల్లో అనుష్క విశ్వరూపం చూపించబోతోందని, అరుంధతి తరవాత.. ఆ స్థాయిలో అనుష్క పేరు తెచ్చుకోవడం ఖాయమని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. కథలో కీలకభాగం ఓ కోట లో సాగుతుంది. ఈ కోటకీ… కథకీ ఓ లింకు ఉంది. అదేమిటన్నది సస్పెన్స్. ఇప్పటి వరకూ ఈ సినిమాపై దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రమోషన్లకు మరో రూ.2 కోట్ల వరకూ అవుతుంది. జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.