నాయని నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో బాగా సీనియర్ అయిన మంత్రి. అందరికంటె సీనియర్‌గా నాయనిని కేబినెట్ సహచరులందరూ గుర్తిస్తారు. ఆయన హోం శాఖతో పాటు కార్మిక శాఖను కూడా చూస్తున్నారు. తాజాగా మేడే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో నాయని మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. దేశం మొత్తం గర్వించదగిన నేత కేసీఆర్ అంటూ.. నాయని విపరీతంగా కేసీర్ భజన చేశారు. కేసీఆర్ కంటె వయోధికుడు, సీనియర్ కూడా అయిన నాయని.. ఈ రేంజిలో కేసీఆర్‌ను కీర్తించడం వెనుక సీక్రెట్ ఏమైనా ఉన్నదేమో అని పలువురు జోకులు వేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పరిణామాల్లో నాయనిని రాజ్యసభకు పంపుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. తెరాసకు నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఆ కోటాలో నాయని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపేసి.. కేబినెట్లో కొత్తగా వేరేవారికి చోటు కల్పించడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్యసభకు వెళ్లడం నాయనికి ఇష్టం లేదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కేసీఆర్‌ను కీర్తించిన తీరు చూస్తోంటే.. సీఎంను ప్రసన్నం చేసుకోవడం ద్వారా మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆయన ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ పదవి కంటె ఎవరైనా సరే.. మంత్రిపదవినే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే అది జారిపోకుండా ఉండడానికి ఈ పాట్లు అని నాయకులు జోకులేసుకుంటున్నారు.