పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.. పలు చోట్ల ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి జిల్లాలకు పంపారు. ఈ నెల 25వ తేదీలోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ప్రతి నెల 28వ తేదీ నాటికి బిల్లులు తీసుకునే సర్కార్ ఈసారి 25వ తేదీకే బిల్లులు పంపాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం.. అన్నింటినీ తగ్గించాల్సి ఉండటం.. డీఏలను కలపాల్సి ఉండటంతో ఏమైనా సమస్యలు వస్తే మూడు రోజుల్లో పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ముందుగానే పంపాలని కోరుతున్నట్లుగా భావిస్తున్నారు. మరో వైపు మంత్రులు.. వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వస్తూ పీఆర్సీని మీరే అంగీకరించారని ఉద్యోగ సంఘ నేతలకు చెబుతున్నారు. అంగీకరించి .. చప్పట్లు కొట్టి ఇప్పుడు ఉద్యమం చేస్తారేంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పేర్ని నాని మరింత ఘాటుగా స్పందించారు.
మొత్తంగా జీతం పెరిగిందో లేదో చూసుకోవాలని.. అంతే కానీ.. ఐఆర్ని జీతంలో భాగంగా చూస్తారాని అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు చూస్తూంటే ఉద్యోగ సంఘాలను మరితం రెచ్చగొట్టేందుకు వ్యూహం పన్నిందని అంటున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ప్రభుత్వం తమ వ్యూహం తాము అమలు చేయడానికి రెడీ అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తదుపరి కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నాయి.