నారా లోకేష్ బాబు ఆస్తులను ప్రకటించారు. ఆయన చాలా సీరియస్‌గా చెప్పుకొచ్చారు కానీ అవగాహన ఉన్నవాళ్ళకు మాత్రం అది అల్లరి నరేష్ కామెడీలా అనిపించింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత కామెడీగా ఎటకారం చేసినా నారా చంద్రబాబునాయుడు నమ్మిన ఓ గొప్ప సిద్ధాంతం ఒకటుంది. అబద్ధమైనా, నిజమైనా చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడమే ఆ సిద్ధాంతం. వ్యక్తిగత విషయాలైనా, పార్టీ విషయాలైనా, ప్రభుత్వ విషయాలైనా, ప్రజలకు సంబంధించిన ఏ విషయాలైనా సరే…ఎవరు ఏమి అనుకున్నా సరే, తను చెప్పదల్చుకున్న విషయాన్ని ఎక్కువ మంది ప్రజలు నమ్మేవరకూ చెప్తూనే ఉంటాడు చంద్రబాబు. మొదట్లో నలుగురు నమ్ముతారు. ఆరుగురు విమర్శిస్తారు. ఆ విమర్శలను అస్సలు పట్టించుకోరు చంద్రబాబు. తను చెప్పిన విషయాలను మాత్రం విసుగు, విరామం లేకుండా, కనీసం బోరింగ్‌గా కూడా పీల్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చెప్తూ ఉంటారు. విమర్శకులు మాత్రం ఎన్ని సార్లని విమర్శిస్తారు? మోరోవర్ చంద్రబాబు మాటలను ప్రజలందరికీ చేరవేసే బలమైన భజన మీడియా ఆయన సొంతం. చంద్రబాబు, ఆయన భజన మీడియా నిరంతరం చెప్పే విషయాలు ఏంటయ్యా అంటే……. ఎన్టీఆర్‌కి కనీసం వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు చేసిన అన్యాయం ఏమీ లేదు, పైగా ఆరు కోట్ల ఆంధ్రులను ఆదుకున్నాడు, హైదరాబాద్‌ని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు సొంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాపం ఏమీ లేదు, రుణమాఫీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు, పుష్కరాల్లో భక్తుల మరణాలకు చంద్రబాబుకు అస్సలు సంబంధమే లేదు, హోదా కంటే మాటల ప్యాకేజీ చాలా గొప్పది, చంద్రబాబు, లోకేష్ ప్రకటిస్తున్న ఆస్తులు పచ్చి నిజం, చంద్రబాబు నిప్పు, ఆయన జన్మలో ఎప్పుడూ అవినీతి చేయలేదు, ఓటుకు కోట్లు కేసుకు చంద్రబాబుకు అస్సలంటే అస్సలు సంబంధం లేదు….. చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ చంద్రబాబు తారక మంత్రం ఒక్కటే. చెప్పిందే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే, తన భజన మీడియాలో ప్రచారం చేయిస్తూ ఉంటే జనాలు చచ్చినట్టు నమ్ముతారు. కనీసం నమ్మే జనాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సిద్ధాంతంతోనే 2014లో విజయవంతమయ్యారు చంద్రబాబు. 2019లో ఏం జరుగుతుందో చూడాలి.
ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు ఆస్తుల ప్రకటన చేసిన లోకేష్‌బాబు హీరోచితంగా కొన్ని సినిమాటిక్ డైలాగులు పేల్చారు. నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టుగా ఎవ్వరూ నిరూపించలేకపోయారని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ళుగా ఆస్తులను ప్రకటిస్తున్నా….ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నట్టుగా ఎవ్వరూ కూడా సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని చెప్పుకొచ్చారు. శభాష్…డైలాగ్స్ అదిరిపోయాయి. క్లాప్స్ కొట్టాల్సిందే. కాకపోతే లోకేష్‌బాబుని ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. పెదబాబుగారు, చినబాబుగారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళపైగానే అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచేస్తామని, రుణమాఫీలు చేసేస్తామని బోలెడన్ని శపథాలు చేసేశారు. ఇక్కడ కూడా నారా వారి ప్రచార సిద్ధాంతం ప్రకారమే ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటాం అని అనేక సార్లు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? మీ మాటల్లోనే చెప్పుకోవాలంటే మీ అక్రమాస్తులను బయటపెట్టడంలో వైఎస్ కుటుంబం ఫెయిల్ అయింది. మరి జగన్ అక్రమాస్తులను బయటపెట్టడంలో, స్వాధీనం చేసుకోవడంలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న పనిని, పవర్ చేతికొచ్చిన రెండేళ్ళ తర్వాత కూడా ఎందుకు చేయలేకపోతున్నారు. నారా ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ వారు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటే ప్రజలకు ఒరిగేదేముంటుంది? వైఎస్ వాళ్ళు ఏమీ చేయలేకపోయారని మీరు విమర్శిస్తున్నారు. అది నిజం కూడా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచండి. అప్పుడు వేస్తాం మీకు వీరతాళ్ళు. మీ హీరోయిజాన్ని ఒప్పుకుంటాం. అంతేగానీ ఊరికే ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఎలా చినబాబుగారూ….?