ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీన అందలేదు. ప్రభుత్వం వద్ద పైసా లేదు. ఉన్న నిధులన్నింటినీ ఆర్థిక సంవత్సరం ముగింపుసందర్భంగా.. తీవ్ర ఒత్తిడి వచ్చిన బిల్లుల చెల్లింపులకు ఇచ్చేశారు. పంచాయతీల నిధులూ ఇచ్చేశారు. ఇప్పుడు జీతాలివ్వడానికి నిధుల్లేవు. చివరికి వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ ఇచ్చే వెసులుబాటును కూడా దాదాపుగా రూ. రెండు వేల కోట్లను వాడుకున్నారు. ఇప్పుడు జీతాలివ్వాలంటే వచ్చే ఆదాయం నుంచి ఇవ్వాలి.
లేదా అప్పు తేవాలి. ఇప్పటికిప్పుడు రూ. ఐదు వేల కోట్ల ఆదాయం రాదు కాబట్టి.. అప్పులు కూడా ముఖ్యమే. కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కొత్త అప్పులకు పర్మిషన్ ఇస్తుంది. ఆ ప్రకారం ఆర్బీఐ నుంచి బాండ్లు వేలం వేసి తెచ్చుకోవచ్చు. ప్రతీ నెలా ఇలాగే అవుతోంది. అప్పులతో జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు వస్తాయని ఎదురు చూడటం.. ఆ తర్వాత చాలా కాలం పాటు రాకపోవజం కామన్ అయిపోయింది.
అందుకే ప్రభుత్వం జీతాల తేదీని.. పదో తేదీకి మారిస్తే బెటర్ అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. ఆ తేదీకిజీతాలు ఇస్తే ఉద్యోగులుకూడా తమ ఈఎమ్ఐలను అప్పటికి సర్దుబాటు చేసుకుంటారని అనుకుంటున్నారు. అయితే ఇలా మార్చడానికి అవకాశం ఉందో లేదో స్పష్టత లేదు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక సమస్యలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు.. అందుకే ఇలాంటి ఆలోచనే బెటరని ఉద్యోగులు కూడా భావిస్తున్నారు.