ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో కనీసం ఓ మాట కూడా మాట్లాడని సీఎం జగన్ .. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి తిరుపతికి వెళ్లి.. అక్కడలోకల్లో ఉండే కొంత మంది వైసీపీ సానుభూతిపరులైన ఉద్యోగుల్ని తన వద్దకు పిలిపించుకున్నారు. వారికి పీఆర్సీ గురించి వివరించారు.
మొత్తం సిద్ధమైపోయిందని పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు.దీంతో వారు చాలా ఉత్సాహంగా బయటకు వచ్చారు. నిజానికి పీఆర్సీ ప్రకటన చేయాల్సింది తిరుపతిలో తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్ని పిలిపించి కాదు కదా… నేరుగా ఉద్యోగ సంఘాలతో భేటీలో చెప్పవచ్చు కదా అనే సందేహం చాలా మందికి వస్తోంది. పైగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆవిషయాన్ని తిరుపతిలో జగన్ చెప్పడమే ఆశ్చర్యానికి కారణం అవుతోంది. అయితే ఈ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు బ్యాలెన్స్డ్గా స్పందిస్తారు. సీఎం అలా ప్రకటించారన్న విషయం మీడియాలోనే చూశామని.. తమకు సమాచారం రాలేదన్నారు.
సీఎం పీఆర్సీ ప్రకటిస్తే తమకూ సంతోషమేనన్నారు. అయితే అదొక్కటే సమస్య కాదని .. ఇంకా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో కూడా ఉద్యోగుల్ని కించ పరుస్తున్నారు. జగన్ మరో రూట్లో వెళ్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం తమతో విభజించు.. పాలించు అనే సూత్రం అమలు చేస్తోందేమోనని ఆందోళన చెందుతున్నారు.