ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. మూడో తేదీన… సుప్రీంకోర్టు సీజేఐ రంజన్ గొగోయ్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ సమయంలోనే.. అసలు ఏపీ హైకోర్టు ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమన్న వాదన… తెరపైకి వచ్చింది. దీన్ని ఎవరో సాదాసీదా వ్యక్తులు తెస్తే పెద్దగా… పట్టించుకునేవారే కాదేమో కానీ.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ చెప్పిన తర్వాతే కొత్త హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేయ్యాల్సి ఉంటుంది. హైకోర్టుల ఏర్పాటుపై అనుసరించాల్సిన విధానం గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ఈ ప్రక్రియను మొత్తం.. దాటవేశారని… జస్టిస్ చలమేశ్వర్ చెబుతున్నారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఫాలో అయితే.. పార్లమెంట్ ఒక తేదీని నిర్ధేశించి రాష్ట్రపతి దగ్గరకు ఒక బృందాన్ని పంపుతుందని ఆయన చెబుతున్నారు. కానీ అలా జరగలేదంటున్నారు. గతంలో హైకోర్టుల ఏర్పాటు విషయంలో ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం వెళ్లారు. ఒక తేదీని, ప్రదేశాన్ని నిర్ణయించేవారని వాదిస్తున్నారు. పార్లమెంట్‌ను తోసిరాజని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా హైకోర్టును ఏర్పాటు చేయడం ఘోరమైన రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన తేల్చి చెబుతున్నారు.
హైకోర్టు ప్రారంభోత్సవానికి చీఫ్ జస్టిస్ గొగోయ్ రాకూడదన్నదే చలమేశ్వర్ అభిప్రాయంా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేసిన విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి భవనం ప్రారంభోత్సవానికి అమరావతికి వెళ్లాలా? వద్దా? అన్నది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయే తేల్చుకోవాలని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలలో స్పష్టం చేసారు. 2019 జనవరి 1వ తేదీ నుంచీ కొత్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని పేర్కొంటూ గత ఏడాది డిసెంబరు 26న రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో గజిట్ విడుదలైంది. ఐదు రోజులు మాత్రమే గడవు ఇవ్వడంపై వివాదం రేగింది.
దీనిపై.. అప్పట్లో చాలా రచ్చ జరిగింది.కానీ.. రాజ్యాంగ ఉల్లంఘన అనే అంశంపై మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన చలమేశ్వర్.. నోరు విప్పారు. దీనిపై… పెద్ద రగడ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో హైకోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి.