ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో విభిన్న కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సామాజికవర్గం. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్‌గా ఉందని భావిస్తున్న సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి.. చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారనేది.. ఆ కోణం. నిన్న దాదాపుగా 19 బృందాలు ఐటీ దాడుల్లో… విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సోదాలు చేస్తే.. దాదాపు అందరి టార్గెట్ ఒకే సామాజికవర్గంలోని వారే. ప్రకాశం జిల్లా కందుకూరులో ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీలు, ఆస్తులపై దాడులు నిర్వహించారు. రామారావు చెల్లెలు , బావ, గుంటూరు విద్యానగర్ లో నివాసం ఉండటంతో ఆయన గృహంలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రామారావు మేనల్లుడు సదరన్ డెవలపర్స్ లో భాగ స్వామిగా ఉన్నారు. శుభగృహ అనే రియల్ ఎస్టేట్ సంస్థపైనా దాడులు జరిగాయి. సదరన్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో ఐటీ సోదాలు చేసింది. జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్ కంపెనీల్లో ఐటీ దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారివి.
ఇంత భారీ స్థాయిలో ఓ దండయాత్రలా.. ఏపీలో ఐటీ సోదాలు జరిగినా.. అధికారులు ఏమేం గుర్తించారు..? అసలు సోదాల్లో ఏం బయటపడ్డాయి..? ఎందుకు ఇంత సడన్‌గా ఐటీ అధికారులు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు..? అనే విషయాలు ప్రకటించలేదు. శుక్రవారంతోనే ఐటీ సోదాలు ముగిశాయా..? లేకుంటే మరో రెండు మూడ్రోజులు దాడులు జరుగుతాయా..? అనే వివరాలు కూడా బయటకు పొక్కనీయడం లేదు. దీంతో ఏపీకి చెందిన పలు కంపెనీల యజమానులు, రాజకీయ నేతలు ఎప్పుడేం జరుగుతుందో అని అయోమయంలో పడ్డారు. ముందు జాగ్రత్తగా చాలా మంది… అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతున్నారు.
ఐటీ దాడుల విషయంలో… ప్రజల్లోనూ అనేక సందేహాలు వస్తున్నాయి. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. ఎవరు ఫిర్యాదు చేశారో తెలియకుండా… అసలు ఫిర్యాదు ఉందో లేదో తెలియకుండా… ఐటీ సోదాలేమిటన్న చర్చ.. ఏపీ మొత్తం జరిగింది. ఇందులో అసలు సీక్రెట్ ఏమిటంటే.. ఎన్ని బృందాలు సోదాలు చేస్తున్నాయన్నదానిపై ఎవరికీ సమాచారం లేదు. అన్ని చోట్లా సోదాలను విశ్లేషిస్తే.. ఒకే సామాజికవర్గంపై దృష్టి పెట్టారన్న విశ్లేషణ బయటకు వచ్చింది. ముందు ముందు.. ఈ ఐటీ దాడుల్లో ఇంకెన్ని కోణాలు కనిపిస్తాయో మరి..!