ఉద్యోగులు వెల్లువలా విజయవాడకు వచ్చి ప్రదర్శన నిర్వహించడం ప్రభుత్వ వర్గాలను నిశ్చేష్ట పరిచింది. కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకూ పీఆర్సీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలీసులకు ఎలాంటి జీతాలు తగ్గవని చెప్పినప్పటికీ వారికీ జీతాలు తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగుల ఉద్యమాన్ని కట్టడి చేసే బాధ్యత పోలీసులే తీసుకున్నారు. రెండు రోజుల ముందు నుంచే నిర్బంధాలు అమలు చేశారు. స్కూళ్లలో ఒక్కో టీచర్‌కు ఒక్కో పోలీసును కాపలా పెట్టారు. తీరా అసలు చలో విజయవాడ సమయం వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది.
లక్షలాది మంది ఉద్యోగులు ఒక్క సారిగా విజయవాడ వచ్చేశారు. కొన్ని పోలీసులు అడ్డుకున్నప్పటికీ అవి కంటి తుడుపుగానే ఉన్నాయి. ఎక్కువ చోట్ల పోలీసులు తూ.. తూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేశారు. పోలీసులు కావాలనే ప్రభుత్వ ఆదేశాలను సైతం ఉల్లంఘించి ఉద్యోగుల ఉద్యమానికి సహకరించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే సీఎం జగన్‌తో సమావేశమై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పోలీసు శాఖను అనధికారికంగా సజ్జల రామకృష్ణారెడ్డినే నియంత్రిస్తూంటారని చెబుతూంటారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలను పోలీసులు లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉద్యోగులు కూడా పోలీసులు సహకరించారన్న భావనలో ఉన్నారు. వారికి కూడా అన్యాయం జరిగిందని.. వారు ఎలాంటి ఆటంకాలు సృష్టించకపోవడం వల్ల ప్రభుత్వానికి దడ పుట్టేలా ర్యాలీ నిర్వహించగలిగామని ఉద్యోగసంఘాల నేతలు భావిస్తున్నారు. పోలీసుల్లో ఇలాంటి మార్పు నిజంగా వచ్చినట్లయితే ముందు ముందు పరిస్థితి వేరుగా ఉంటుందన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది.