రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సకల శాఖా మంత్రిగా ముద్ర ఉంది. ఆయన పోలీసు శాఖపై పూర్తి అదుపు సాధించారన్న అభిప్రాయం కూడా ఉంది. పోలీసు పోస్టింగ్స్ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. గత డీజీపీ సవాంగ్ ఉన్నట్లుగా చూసీచూడనట్లుగా వ్యవహరించే పరిస్థితి లేదని ఆయన స్వతంత్రంగా పోలీసు వ్యవస్థను పనితీరును పర్యవేక్షిస్తారని భావిస్తున్నారు. అందుకే తన కొత్త టీమ్‌ను రంగంలోకి తెచ్చుకునేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.
సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌ను కసిరెడ్డి బదిలీ చేయాలని అనుకుంటున్నట్లుగా పోలీసు శాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఐడీ ద్వారా ఏపీ అధికార పార్టీ ఎన్ని రాజకీయ లక్ష్యాలను సాధించాలనుకుంటుందో.. సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక సార్లు నోటీసులు వచ్చాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనపై రకరకాల ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు చేశారు. వారు ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు మారుస్తారా అన్నది డౌటే.
కొత్త డీజీపీ స్వతంత్రంగా వ్యవహరిస్తే పోలీసు శాఖ మునుపటి పని తీరును అందుకునే అవకాశం ఉంది. కసిరెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంలో పోలీసు వ్యవస్థ పనితీరు మారుతుందన్న సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రకారం చూస్తే సజ్జలకు బాధ్యతలు తగ్గిపోతాయని.. మొత్తంగా డీజీపీగా సవాంగ్ మార్క్ పనితీరు మాత్రం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.