జగన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కర్ని వదులుకున్నా అది జగన్ రెడ్డికి నైతిక దెబ్బే అవుతుంది. ముఖ్యంగా బాలినేని లాంటి బంధువు దూరం అయితే ఎక్కువ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన వద్దకు విడదల రజనీ వంటి వారిని పంపి చర్చలు జరిపిస్తున్నారు. అయితే బాలినేని డిమాండ్లు మాత్రం.. ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
జిల్లా మొత్తాన్ని తన చేతిలో పెట్టాలని బాలినేని డిమాండ్ చేస్తున్నారు. చెవిరెడ్డిని దరిదాపుల్లోకి రానివ్వకూడదని వైవీ సుబ్బారెడ్డిని బయట వాడుకోవాలని.. అలా అయితేనే తాను పార్టీలో ఉంటానని స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆయన జగన్ పై ఒత్తిడి పెంచడానికి లీకులుకూడా ఇస్తున్నారు. షర్మిల అడ్డుపడుతోంది కాబట్టి కాంగ్రెస్ లో ఇంకా వైసీపీ విలీనం కాలేదని లేకపోతే ఈ పాటికి పూర్తయ్యేదని బాలినేని తనను కలిసి సన్నిహితులకు చెబుతున్నారు. వచ్చే ఏడాదికైనా అదే పరిస్థితి ఉంటుందంటున్నారు.
బాలినేని అటు ఇతర పార్టీల్లోకి పోయే పరిస్థితి లేదు. ఆయన జనసేన పార్టీని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ పార్టీలోకి వెళ్తున్నట్లుగా ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ బాలినేని లక్ష్యం.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి.. ప్రకాశం జిల్లాపై పెత్తనం తీసుకోవడమేనని అంటున్నారు. ఆయన గతంలోనూ ఓ సారి ఇదే ట్రిక్ ప్లే చేశారు. అప్పట్లో విజయమ్మ నచ్చ చెప్పిందని అంటారు. ఇప్పుడు విడదల రజనీ వంటి వాళ్లు నచ్చ చెబుతున్నారు. ఏం జరుగుతుదో మరి !?