కొండా సురేఖ దగ్గర్నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ వరకూ అనేక పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ చివరికి హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడ్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ కు టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు రెడీ చేశారు. రేవంత్ రెడ్డికి కూడా వెంకట్ సన్నిహితుడు. ఏఐసీసీ ఆమోదంతో నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కూడా విద్యార్థి నాయకుడే. టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. వెంకట్ హుజురాబాద్ కు స్థానికుడుకాదు కానీ.. ఉమ్మడికరీంనగర్కు చెందిన వారు. ఇటీవలి కాలంలో విద్యార్థి విభాగం చురుగ్గా పని చేస్తోంది. ఢిల్లీలో నిరసనలకూ హాజరవుతున్నారు. ఇలా రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఓ ఆందోళనకు వెళ్లి ఢిల్లీలో గాయాలపాలయ్యారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా వెంకట్ పోరాటాన్ని మెచ్చుకున్నారు.
అయితే హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను కాపాుడకోవడమే లక్ష్యంగా పోటీ చేయాల్సిఉంటుంది.ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో నిస్సత్తువ ఏర్పడుతుంది. అయితే బలమూరి వెంకట్ పేరును అయినా ఖరారు చేస్తారా లేకపోతే.. నామినేషన్ల చివరి తేదీ వరకూ నాన్చి చివరికి ఎవరో ఒకరని బీఫాం ఇస్తారా అన్నదానిపైనా కాంగ్రెస్‌లోనే సెటైర్లు పడుతున్నాయి.