గత కొంతకాలంగా తెలంగాణ బిజెపి తో తమకు సమన్వయం సరిగాలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. అయితే ఈ పొత్తు పై బండి సంజయ్ అసహనం గా ఉన్నట్లు అంతర్గత సమాచారం. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ఇతర తెలంగాణ బీజేపీ నేతలను పక్కనపెడుతున్నట్లు ఎప్పటినుండో విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇతర బిజెపి సీనియర్ నేతలను ఆయన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనికితోడు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత ఆయన మరింత అహంకరంగా మారిపోయాడని, అందువల్లే తమకు జనసేన తో సహా ఎవరి పొత్తూ అక్కర్లేదన్నట్లు వ్యవహరించాడనే అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తమయింది. ఆయనతోపాటు ఆయనతో సఖ్యంగా ఉండే డీకే అరుణ లాంటి వారు కూడా జనసేన గురించి చులకన వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూర్చింది.
అయితే బండి సంజయ్ వ్యవహార శైలి కారణంగా పార్టీకి నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి మాజీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తదితరులు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాజాగా బిజెపి జనసేన మధ్య ఖమ్మం ఎన్నికలలో పొత్తు పొడవడానికి కిషన్ రెడ్డి , కే లక్ష్మణ్ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పైగా ఈ చర్చలకు బండి సంజయ్ ని దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో ఖమ్మం ఎన్నికల్లో బిజెపి జనసేన మధ్య పొత్తు నిర్ణయం బండి సంజయ్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ కారణంగానే బండి సంజయ్ ఖమ్మం ఎన్నికల లో జనసేన తో పొత్తు పై అసహనం గా ఉన్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా తెలంగాణ బిజెపి లో లుకలుకలు కూడా ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. మరి ఖమ్మం ఎన్నికల్లో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.