అయిదు దశాబ్దాల సినీ ప్రయాణం. 40 వేల పైచిలుకు పాటలు. 25 నంది అవార్డులు. జాతీయ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ – సత్కారాలు. ఇవన్నీ బాలు ప్రతిభకు నిలువుటద్దాలు. ఇప్పుడు బాలుకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. బాలు భారతరత్నకి అన్ని విధాలా అర్హుడని, ఆయనలా 40 వేల పాటలు పాడడం ఏ గాయకుడికీ సాధ్యం కాదని ప్రముఖ కథానాయకుడు అర్జున్ గళం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరింత పెరుగుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కూడా బాలుకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశారు.
బాలు అంటే అందరికీ అభిమానమే. బాలు తెలుగు బిడ్డ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయమై.. కేంద్రంపై ఒత్తిడి తెస్తే బాలుకి భారతరత్న అందడం కష్టమేమీ కాదు. పైగా తమిళ జనాలు సైతం బాలుని నెత్తిన పెట్టుకున్న వాళ్లే. బాలు చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చినా – ఆయన చెన్నైని వీడలేదు. అందుకే తమిళులు `బాలు మా వాడే` అని గర్వంగా చెప్పుకుంటారు. కన్నడ, మలయాళ చిత్రసీమలు సైతం బాలుని ఓన్ చేసుకున్నాయి. బాలీవుడ్ మాటేమో గానీ, దక్షిణాది రాష్ట్రాలన్నీ బాలు వెనకే ఉన్నాయి. వాళ్లంతా గట్టిగా పట్టుబడితే – బాలుకి భారతరత్న సాధ్యమే. బాలు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. ఏ పార్టీ మనిషి కాదు. కాబట్టి – ఎవరి నుంచీ పెద్ద వ్యతిరేకత రాకపోవొచ్చు. అయితే తెలుగు వాళ్లు చేసే భారతరత్న డిమాండులను కేంద్రం పెద్దగా పట్టించుకోదు.ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ.. అది కంఠ శోషగానే మిగిలిపోయింది. పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అడుగుతోంది. అది డిమాండ్ గానే మిగిలిపోయింది. మరి ఎస్పీబీ సంగతి ఏమవుతుందో?