మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పయునుమ్ కోషియమ్` తెలుగులో `భీమ్లా నాయక్` గా రూపుదిద్దుకుంటోంది. తొలి గ్లిమ్స్ రూపంలో వచ్చిన చిన్న టీజర్.. యూ ట్యూబ్ రికార్డుల్ని షేక్ చేసేస్తోంది. `పవన్ ని ఇలా చూసి చాలాకాలమైంది` అంటూ అభిమానులు సంతోష పడిపోతున్నారు. మొత్తానికి తొలి గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది.
అయితే… రానా ఎక్కడ? అనే ప్రశ్న మాత్రంఈ టీజర్‌ని వెంటాడింది. నిజానికి `అయ్యప్పయునుమ్ కోషియమ్` సింగిల్ స్టార్ సినిమా కాదు. మలయాళంలో బీజూ మీనన్ – ఫృథ్వీరాజ్ కలిసి చేసిన సినిమా అది. తెలుగులోనూ మల్టీస్టారర్ గానే రూపొందుతోంది. బీజూ మీనన్ పాత్రలో పవన్, ఫృథ్వీరాజ్ పాత్రలో.. రానా నటిస్తున్నారు. మలయాళంలో రెండు పాత్రలకూ సమ ప్రాధాన్యం ఉంది. రెండు పాత్రల పేర్లే టైటిల్ గా పెట్టారు. కానీ తెలుగులో స్ట్రాటజీ మారింది. ఇక్కడ పవన్ పాత్రే.. టైటిల్ అయ్యింది. తొలి గ్లిమ్స్‌లో రానా కనిపించలేదు కూడా. దాన్ని బట్టి.. `భీమ్లా నాయక్` ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవొచ్చు.
నిజానికి ఓ రకంగా ఇది బిజినెస్ స్ట్రాటజీనే అనుకోవాలి. ఎందుకంటే.. మలయాళంలో బీజూ మీనన్ కి ఉన్న క్రేజ్ వేరు. తెలుగులో పవన్ స్టాయి వేరు. పవన్ ని బట్టే ఇక్కడ బిజినెస్ ఉంటుంది. రానా తక్కువాడేం కాదు. కాకపోతే..తన ముందు పవన్ అనే పెద్ద గీత ఉంది. అందుకే రానా చిన్న గీతగా మారాల్సివచ్చింది. ఓ మల్టీస్టారర్ సినిమా అనేదానికంటే, పవన్ సినిమా అంటేనే బిజినెస్ పరంగా క్రేజ్ ఉంటుందని నిర్మాతలు భావించి ఉండొచ్చు. ఇక్కడ త్రివిక్రమ్ మాస్టర్ మైండ్ కూడా ఉంది. `గోపాల గోపాల` కూడా మల్టీస్టారర్ సినిమానే. పవన్ – వెంకీ కలిసి నటించిన సినిమాగా అది బయటకు వచ్చింది. దాని మార్కెట్ పవన్ గత చిత్రాల మార్కెట్ కంటే తక్కువ స్థాయిలో జరిగింది. కారణం.. దానిపై మల్టీస్టారర్ ముద్ర పడడం. పవన్ సోలో సినిమాగా `భీమ్లా నాయక్`ని ప్రజెంట్ చేయగలిగితే.. మంచి రిజల్ట్ వస్తుందని భావించి ఉండొచ్చు. అయితే.. ఇక్కడ రానా పరిస్థితేంటన్నదే కీలకమైన ప్రశ్న. బాహుబలి తరవాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా సరిగా ఆడలేదు. `విరాట పర్వం` ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. తను కూడా మల్టీస్టారర్లే సేఫ్ గేమ్ అనుకోవొచ్చు. ఇది పవన్ సినిమాగా విడుదల కావడం – కూడా తను లైట్ తీసుకుంటున్నట్టే అనుకోవాలిక.